భువనేశ్వర్: విద్య, వైజ్ఞానికతతో దూసుకుపోతున్న సమాజంలో ఇంకా మూఢ నమ్మకాలు కొనసాగుతున్నాయి. సంప్రదాయ ముసుగులో అంధ విశ్వాసాల ఆచరణ యథేచ్ఛగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలు వింతలు, విడ్డూరాలు వర్ధమాన సమాజంలో వెలుగు చూస్తున్నాయి. ఇటువంటి వింత ఆచారం బాలాసోర్ జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చింది.
కుక్కతో బాల్య వివాహం చేస్తే బాలారిష్టాలు తొలగి పోతాయని ఇరువురు బాలలకు వివాహం జరిపించారు. సంప్రదాయ గిరిజన సమాజంలో పసి పిల్లలకు తొలి దంతం/పన్ను పైవరుసలో మొలిస్తే అరిష్టంగా పరిగణిస్తారు. ఈ అరిష్టం తొలగించేందుకు ఆ బాలుడు లేదా బాలికను కుక్కతో పెళ్లి జరిపించడం ఆచారంగా కొనసాగుతోంది. బాలలకు పైవరసలో తొలి దంతం మొలిస్తే పలు రకాల వ్యాధులు వేధిస్తాయని ఈ వర్గం ఆందోళన.
పిల్లల్లో ఈ బాలారిష్టం తొలగించేందుకు కుక్కతో పెళ్లి జరిపిస్తే రోగాలు, వ్యాధులు తొలగి.. పెళ్లి జరిపించిన శునకానికి సంక్రమించి, మరణిస్తుందని నమ్మకం. దీంతో బాలలు జీవితకాలం ఆరోగ్యవంతులుగా చలామణి అవుతారని సంప్రదాయ గిరిజన వర్గం ప్రగాఢ విశ్వాసం. ఈ క్రమంలో బాలాసోర్ జిల్లా సొరొ మండలం సింగాఖుంటా పంచాయతీ బొంధొసాహి గ్రామంలో ఇద్దరు బాలలకు తొలి దంతంపై చిగుళ్లపై మొలిచాయి. వీరివురినీ అవాంఛిత రోగ పీడల నుంని సంరక్షించేందుకు రెండు కుక్కలతో వేర్వరుగా బాల్య వివాహం వైభవంగా నిర్వహించారు.
సంప్రదాయ ఆచారాలతో పెళ్లి..
బొంధొసాహి గ్రామంలో మఛువాసింగ్ కుమారుడు, మానస్‌సింగ్ కుమార్తెకి తొలి దంతంపై చిగుళ్లపై మొలిచింది. ఈ ఇరువురు బాలలకు కుక్కతో పెళ్లి జరిపించారు. మఛువా సింగ్ కుమారుడికి ఆడ కుక్క, మానస్‌సింగ్ కుమార్తెకు మగ కుక్కతో పెళ్లి వేడుకగా జరిపించారు. పెళ్లి తంతును సంప్రదాయ రీతుల్లో అత్యంత ఆనందోత్సాహాలతో జరిపించారు. గ్రామంలో 7 కుటుంబాలకు చెందిన సభ్యులు పసుపు, ఆవాలు, మరుగునీళ్లతో పెళ్లి వారింటికి చేరారు. ఈ బృందంతో కలిసి వధూవరుల కుటుంబీకులు గ్రామం నాలుగు దిక్కుల కూడలి ప్రాంతానికి చేరారు. ఈ కుటుంబాల సభ్యులు తీసుకు వచ్చిన మరుగునీటితో బాలలకు స్నానం చేయించారు. ఆభరణాలతో అలంకరించి పెళ్లికి సిద్ధం చేశారు. ఈ తంతు ముగియడంతో శునక వధూవరులను పెళ్లి వేదిక ప్రాంగణానికి ఆర్భాటంగా అలంకరించి తీసుకు వచ్చారు. కుక్క చీలమండకు సంప్రదాయ సూత్రం తొడిగి పెళ్లి జరిపించారు.
కుక్కకు కాలం చెల్లినట్లే..!
ఇలా బాలలతో పెళ్లి చేసుకున్న శునక వధూవరులకు కాలం చెల్లినట్లే. పెళ్లి జరిగిన కొంత కాలానికి బాలలతో పెళ్లి జరిపించుకున్న కుక్కలు పలు రకాల రోగాల బారినపడి చనిపోతాయని స్థానికుల విశ్వాసం. ఇవి చనిపోవడంతో కుక్కలను పెళ్లాడిన బాలలకు సకల అరిష్టాలు తొలగిపోయి, జీవితాంతం ఆనందోత్సాహాలతో బతుకుతారు. ఇదీ శునకంతో బాల్య వివాహం వాస్తవ వృత్తాంతం.
Comments
Please login to add a commentAdd a comment