భువనేశ్వర్: బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో జూన్ 2న జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఏడుగురు ఉద్యోగులను రైల్వేశాఖ తొలగించింది. ఈ ప్రమాదంలో 294మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 1,100 మందికి పైగా గాయపడ్డారు. ఈ మేరకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
వీరిలో ముగ్గురు ప్రస్తుతం సీబీఐ రిమాండ్‌లో ఉన్న ముగ్గురు ఎస్‌ఎండ్‌టీ అధికారులు కూడా ఉన్నారని ఆగ్నేయ రైల్వే జనరల్ మేనేజర్ అనీల్‌కుమార్ మిశ్రా తెలిపారు. వీరితో ప్రమాదానికి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిన సిబ్బందిగా గుర్తించిన బహనాగా బజార్ స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్, మెయింటైనర్లను సస్పెండు చేసినట్లు సమాచారం. బహనాగా బజార్, బాలాసోర్ రైల్వే స్టేషన్లను సౌత్‌ఈస్ట్ రైల్వే జీఎం, డీఆర్‌ఎం బుధవారం ప్రత్యక్షంగా సందర్శించారు. అనంతరం సిబ్బందికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టారు. ఈ అధికారులు బాలాసోర్ ఎంపీ ప్రతాప్‌చంద్ర షడంగితో కలిసి గోపీనాథ్‌పూర్ రైల్వే స్టేషన్‌ను కూడా సందర్శించారు.
ఈ సందర్భంగా బాలాసోర్–నీలగిరి సెక్షన్‌ను పర్యవేక్షించారు. సీబీఐ అరెస్ట్ చేసిన ముగ్గురు రైల్వే ఉద్యోగులు సీనియర్ సెక్షన్ ఇంజినీర్(సిగ్నల్), అరుణ్‌కుమార్ మహంత, సీనియర్ సెక్షన్ ఇంజినీర్ మహ్మద్ అమీర్‌ఖాన్, టెక్నీషియన్ పప్పుకుమార్ లను మరో 4 రోజులు రిమాండ్ కొనసాగించారు. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు నుంచి అనుమతి లభించింది.
అప్రమత్తంగా ఉండి ఉంటే..!
ఈ దుర్ఘటన పురస్కరించుకుని ఆగ్నేయ సర్కిల్ రైల్వే భద్రతా కమిషనర్(సీఆర్‌ఎస్) సమర్పించిన విచారణ నివేదిక బహనాగా బజార్ స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదానికి సిగ్నలింగ్ సమస్యలతో సహా అనేక మానవ లోపాలను ఎత్తి చూపింది. దీని ఆధారంగా రైల్వేశాఖ అధికారులు.. బాధ్యులుగా భావిస్తున్న వారిని విధుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. సీఆర్‌ఎస్ విచారణ పట్ల పలు రాజకీయ పక్షాలు విశ్వసనీయత ప్రదర్శించిన విషయం తెలిసిందే. రైలు దుర్ఘటనల్లో ఈ వర్గం విచారణ అత్యంత పారదర్శకతతో అనుబంధ లోటుపాటులను పటిష్టంగా ఖరారు చేయగలుగుతుందని పలు వర్గాల్లో నమ్మకం బలపడి ఉంది.
సీబీఐ విచారణ నేరపరమైన ప్రమేయాన్ని వెలికి తీయగలుగుతుంది. రైల్వే శాఖా పరమైన అంశాలను రైల్వే భద్రతా కమిషనర్ విచారణ తేటతెల్లం చేస్తుందని విశ్వసిస్తున్నారు. ఈ విచారణ పూర్తయి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక దాఖలు చేయడం పూర్తయ్యింది. సీఆర్‌ఎస్ విచారణ మానవ తప్పిదపరమైన లోపాలు ఘోర దుర్ఘటనను ప్రేరేపించాయని స్పష్టం చేసింది.
ఆగ్నేయ రైల్వే జనరల్ మేనేజర్ అనీల్‌కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. ‘ప్రమాదానికి దారితీసిన కారణాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) దర్యాప్తు చేస్తోంది. ఈ వర్గం నివేదిక కోసం వేచి ఉన్నాం. మరోవైపు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు రైల్వే ఉద్యోగుల వ్యతిరేకంగా శాఖాపరంగా చర్యలు తీసుకోవడం జరిగింది. వీరు విధి నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉంటే ప్రమాద నివారణ సాధ్యమయ్యేదని భావిస్తున్న’ట్లు పేర్కొన్నారు.
ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా విశాఖ–కాశీ వీక్లీ రైలు కొనసాగింపు
భువనేశ్వర్: ప్రయాణికుల ఆసక్తి దృష్ట్యా విశాఖపట్నం–బనారస్(కాశీ) మధ్య నడుస్తున్న వీక్లీ ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగించినట్లు తూర్పుకోస్తా రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లలో ద్వితీయ శ్రేణి ఎయిర్ కండిషన్–1, తృతీయ శ్రేణి ఎయిర్ కండిషన్–3, స్లీపర్ శ్రేణి–12, సాధారణ శ్రేణి–2, ద్వితీయ శ్రేణి కమ్ లగేజీ, దివ్యాంగుల కోచ్‌లు–2 సౌకర్యం అందుబాటులో ఉంటాయి. ఇది విశాఖపట్నం, బనారస్ స్టేషన్ల మధ్య సింహాచలం, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ, మునిగుడ, కెసింగ, టిట్లాగఢ్, బొలంగీర్, బర్‌గడ్ రోడ్, సంబల్‌పూర్, ఝార్సుగుడ, రౌర్కెలా, హతియా, రాంచీ, మూరి, బర్కకానా, లాతేహర్, డాల్తోగంజ్, గర్వా రోడ్, డెహ్రీ ఆన్ సోన్, ససారాం, భబువా రోడ్, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, వారణాసి స్టేషన్లలో ఆగుతుంది.
► 08588 విశాఖపట్నం–బనారస్ వీక్లీ స్పెషల్ రైలు జూలై 19నుంచి ఆగస్టు 30 వరకు ప్రతి బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 4.30 గంటలకు బనారస్ చేరుకుంటుంది.
► తిరుగు ప్రయాణంలో 08587 బనారస్–విశాఖపట్నం వీక్లీ స్పెషల్ జూలై 20 నుంచి ఆగస్టు 31 వరకు ప్రతి గురువారం ఉదయం 6 గంటలకు బనారస్ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ క్రమంలో ఉభయ దిశల్లో ఈ రైళ్లు 7 సార్లు రవాణా అవుతాయి.
ఆలస్యంగా రైళ్లు..
భువనేశ్వర్: దక్షిణాది ప్రాంతాల మధ్య రాకపోకలు చేస్తున్న పలు ప్రయాణికుల రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుగు ప్రయాణంలో బయల్దేరాల్సిన స్టేషన్ వేళలను సవరించి, సర్దుబాటు చేసి నడిపిస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. బుధవారం షాలీమార్ నుంచి బయల్దేరాల్సిన 12841 అప్ షాలీమార్–ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు నిర్థారిత సమయం మధ్యాహ్నం 3.20 గంటలు కాగా సాయంత్రం 5 గంటలకు బయలు దేరుతుందని ప్రకటించారు. బుధవారం రాత్రి 11.55 గంటలకు హౌరా నుంచి బయల్దేరాల్సిన 12839 అప్ హౌరా–ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ మెయిల్ గురువారం ఉదయం 5 గంటలకు ఆలస్యంగా బయలు దేరుతుందని ప్రకటించారు. బుధవారం ఉదయం 10.35 గంటలకు బయలుదేరాల్సిన 12864 డౌన్ ఎస్‌వీఎంటీ బెంగుళూరు–హౌరా ఎక్స్‌ప్రెస్ వేళలు సవరించి మధ్యాహ్నం 1గంటకు ఆలస్యంగా నడిపించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment