ఉత్సాహంగా
రాయగడ: స్థానిక తేజస్వీ ఓపెన్ గ్రౌండ్‌లో రాయగడ జిల్లా ఉగాది ఉత్సవ కమిటీ పేరిట రాజ్యసభ మాజీ సభ్యుడు నెక్కంటి భాస్కరరావు నేతృత్వంలో ఈ నెల 30, 31 తేదీల్లో ఉగాది ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం వివిధ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టణ ప్రముఖులు రాఘవ కుముంధాన్, గౌరవ అతిథిగా సంఘం నాయుడు హాజరై పోటీలకు శ్రీకారం చుట్టారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచే ఈ వేడుకలు గత 12 సంవత్సరాలుగా రాజ్యసభ మాజీ సభ్యుడు నెక్కంటి భాస్కరావు రాయగడ జిల్లా ఉగాది ఉత్సవ కమిటీ పేరిట నిర్వహిస్తున్నారని కుముంధాన్ అన్నారు. అంతా ఏకమై ఉగాది సంబరాలను ఆనందంగా జరుపుకోవడం సంతోషకరమైన విషయమన్నారు. ఈ ఏడాది కూడా ఆయన నేతృత్వంలో కొనసాగుతున్న వేడుకలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న పోటీలకు అనూహ్య స్పందన లభించిందని అన్నారు. మహిళల మధ్య ముగ్గులు, రంగోలీ పోటీల్లో ఉత్సాహంగా మహిళలు పాల్గొన్నారు.
అలరించిన ముగ్గులు పోటీ..
తేజస్వీ ఓపెన్ గ్రౌండ్‌లో నిర్వహించిన ముగ్గులు, మెహేందీ పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. 91 మంది మహిళలు, చిన్నారులు తలపడ్డారు. నిర్వహకులే రంగులను ఉచితంగా సరఫరా చేశారు. రాయగడ ప్రజల ఆరాధ్య దైవం మజ్జిగౌరి అమ్మవారు, వేంకటేశ్వరస్వామి ఆకృతులలో వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి.
విజేతల వివరాలు..
ముగ్గుల పోటీల్లో మొదటి మూడుస్థానాల్లో బిజయ లక్ష్మి,, ఎం.మౌనిక, జె.గంగాలు గెలుచుకోగా.. భవానీ బిడిక, గాయత్రి, పి.వర్షాలు ప్రోత్సాహక బహుమతులు దక్కించుకున్నారు. అలాగే మెహేందీ పోటీల్లొ మొత్తం 76 మంది మహిళలు పాల్గొనగా వీరిలో ప్రథమ బహుమతిని సొఫియా బెహర, ద్వితీయ బహుమతిని రాధారాణి కౌసల్య, తృతీయ బహుమతిని పి.వర్షితలు గెలుపొందగా సంజు పాఢి, వనితా పట్నాయక్, జె.గంగలు ప్రొత్సాహక బహుమతులను గెలుచుకున్నారు. పోటీల్లో పాల్గొన్నవారందరికీ నిర్వాహకులు పార్టిసిపేషన్ బహుమతులను అందజేశారు. కమిటీ సభ్యులు సుజాత పాలొ, రోజా, షర్మిష్టా పాఢి పోటీలను పర్యవేక్షించారు. విజేతలకు ఉగాది సంబరాల్లో బహుమతులను అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఉగాది పోటీలు
ఉగాది పోటీలు