
తొలిరోజు పొగాకు కొనుగోలు చేస్తున్న కంపెనీ ప్రతినిధులు
యడ్లపాడు: నల్లబర్లీ పొగాకు రకానికి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రకారంగా గిట్టుబాటు అందించనున్నట్లు జీపీఐ కంపెనీ మేనేజర్ కోట ఉమామహేష్ చెప్పారు. మండలంలోని తిమ్మాపురం గ్రామంలో జీపీఐ, యూఎల్‌టీ కంపెనీల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొగాకు కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు ప్రకాశం జిల్లాలో అత్యధికంగా నల్లబర్లీ సాగు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో ఏటా 10 నుంచి 15వేల హెక్టార్ల విస్తీర్ణంలో నల్లబర్లీ రకాన్ని రైతులు సాగు చేస్తున్నట్లు వివరించారు.
ఈ ఏడాది 12వేల హెక్టార్లలో వీటిని సాగు చేశారన్నారు. తమ కంపెనీ ఆధ్వర్యంలో గత రెండేళ్లుగా ఈ ప్రాంతంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. మూడో ఏటా ప్రారంభించిన ఈ కేంద్రం వచ్చే జూలై వరకు ఉంటుదన్నారు. పొగాకు రైతులు తమ వద్ద ఉన్న నల్లబర్లీ పొగాకు తేమ లేకుండా గ్రేడ్ చేసుకుని కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. ఒక్కో రైతు ఎంత ఉత్పత్తినైనా తీసుకురావచ్చని ఉదయం 8 గంటల నుంచి కేంద్రం ప్రారంభం రైతులకు అందుబాటులో ఉంటుందన్నారు. సంబంధిత రైతులు తమ ఆధార్, బ్యాంక్ ఖాతా నంబర్లతో సరుకు తీసుకురావాలని కోరారు. నాలుగు జిల్లాలకు చెందిన పొగాకు రైతులు తమ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని మంచి గిట్టుబాటు ధరను పొందాలని ఆకాంక్షించారు.