
ఫిల్లింగ్ పాయింట్‌ని ప్రారంభిస్తున్న ఈడీ ఆదంసాహెబ్
వేటపాలెం: ఏపీఎస్‌ఆర్టీసీకి ఆదాయం పెంపుకోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే ఆదంసాహెబ్ పేర్కొన్నారు. వేటపాలెం మండలం వేటపాలెం–చీరాల ప్రధాన రోడ్డు పక్కన పాత ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఏపీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిల్లింగ్ స్టేషన్‌ని ఈడీ శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నెల్లూరు రీజనల్ పరిధిలో మొట్టమొదటిసారిగా వేటపాలెంలో ఫిల్లింగ్ స్టేషన్‌ని ఏర్పాటు చేశామన్నారు. ఈ స్టేషన్ ద్వారా వాహనదారులకు నాణ్యమైన డీజిల్, పెట్రోల్ అందుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్‌ఆర్టీసీకి సంబంధించిన ఖాళీ స్థలాలను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు తెలిపారు.
సంస్థ ఆదాయం పెంపుకోసం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్గో సేవల ద్వారా ప్రతి ఏడాది సంస్థకు రూ.250 కోట్లు ఆదాయం సమకూర్చుతున్నట్లు తెలిపారు. రాబోవు కాలంలో ఆదాయాన్ని రూ.500 కోట్లకి పెంచేవిదంగా చర్యలు తీసుకుంటామన్నారు. దీనితో పాటు కమర్షియల్ ద్వారా కూడా మరో రూ.500 కోట్లు ఆదాయ సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వివిధ మార్గాల ద్వారా సంస్థకు వచ్చిన ఆదాయంతో ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించడానికి కృషిచేస్తామని వివరించారు. కార్యక్రమంలో కమర్షియల్ చీఫ్ మేనేజర్ పీ చంద్రశేఖర్, వివిధ ఆర్టీసీ డిపో మేనేజర్లు శ్రీనివాసరెడ్డి, అజతకుమారి, కే శ్యామల సిబ్బంది పాల్గొన్నారు.