రొంపిచర్ల: రాష్ట్ర రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ అనుమతులు లేకుండా ధర్నా చేయటంతోపాటు విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్‌బాబు తెలిపారు. టీడీపీ మండల అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై అతని సమీప బంధువు, అదే పార్టీకి చెందిన పమ్మి వెంకటేశ్వరరెడ్డి దాడికి పాల్పడగా చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతిని నిరసిస్తూ రొంపిచర్ల విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలోని అద్దంకి–నార్కెట్‌పల్లి రాష్ట్ర రహదారిపై బుధవారం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. సుమారు రెండు గంటలు రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
దీంతోపాటు ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకుని ఆందోళన విరమించాలని టీడీపీ నాయకులకు సర్థి చెప్పారు. అయినప్పటికీ వినకుండా రెండు గంటల సేపు రోడ్డుపై బైటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పట్ల దురుసుగా వ్యవహరించి వారి విధులకు ఆటంకం కలిగించారు. ఈ మేరకు వీఆర్వో సుబ్బారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చదలవాడపై కేసు నమోదు
నరసరావుపేటరూరల్: నరసరావుపేట–చిలకలూరిపేట రోడ్డులోని ఎస్‌ఆర్‌కేటీ కాలనీ వద్ద బాలకోటిరెడ్డి మృతదేహంతో ధర్నా నిర్వహించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబుతో సహా 30 మందిపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా దాదాపు గంటన్నరపాటు ధర్నా నిర్వహించినట్లు వీఆర్వో రత్నకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు శుక్రవారం రూరల్ ఎస్‌ఐ బాలనాగిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment