విధి ఆటలో నలిగిన స్నేహం
సత్తెనపల్లి: వారిద్దరూ ప్రాణ స్నేహితులు.. తరగతులు, వయసులు, పాఠశాలలు.. వెరేనే.. కానీ మనసు మాత్రం ఒక్కటే. సెలవు వస్తే ఎక్కడికై నా కలిసే వెళతారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పాఠశాలలకు బుధవారం సెలవు రావడంతో కొద్దిసేపు సరదాగా కలిసి ఆడుకునేందుకు పొద్దు పొద్దునే బయలు దేరారు. ద్విచక్రవాహనం పై ఆటలకు వెళ్లి వస్తుండగా వీరి అన్యోన్యతపై విధికి కన్నుకుట్టింది. ఇద్దరినీ బలి తీసుకుంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని అచ్చంపేట రోడ్‌లో గల సాయికృష్ణ సినిమా థియేటర్ దగ్గరలో బుధవారం ఈ దారుణం చోటుచేసుకుంది. పండుగ పూట రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని వడ్డవల్లి బ్రహ్మం గారి గుడి ప్రాంతంలో నివసించే తోట సంతోష్ కుమార్ (15) పట్టణంలోని భాష్యం స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాడు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్కూలుకి సెలవు ఇవ్వడంతో క్రికెట్ ఆడుకునేందుకు ఉదయాన్నే తన ఇంటి దగ్గర ఉండే స్నేహితుడు లింటిల్ ఏంజల్స్‌లో 5వ తరగతి చదివే కూరపాటి లిఖిత్(11) ఇద్దరు కలిసి ద్విచక్రవాహనంపై వావిలాల గోపాలకృష్ణయ్య మెమోరియల్ పార్కు దగ్గరకు వెళ్ళారు. అక్కడ మిత్రులు ఎవరూ కనిపించక పోవడంతో మళ్లీ తిరిగి ప్రయాణం అవుతూ అచ్చంపేటరోడ్‌లోని రైల్వేగేట్ వద్ద నుంచి సాయి కృష్ణ సినిమా థియేటర్ వైపు వస్తూ పాత లిక్కర్ మాల్ సమీపంలో రోడ్డుమీద నిర్లక్ష్యంగా ఆపి ఉంచిన గడ్డిమోపు ట్రాక్టర్ సైడ్ ఉండేటువంటి డోర్లు తీసి ఉంచడంతో ఉదయాన్నే 7 గంటల ప్రాంతంలో మంచు కురుస్తూ ఉండడంతో అది కనపడని సంతోష్‌కుమార్ వెళ్లి ఆ ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టడంతో తలకు బలమైన గాయం తగిలి సంతోష్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్రవాహనం పై వెనుక కూర్చున లిఖిత్ మెడ నరాలు విరిగి కింద పడిపోవడంతో స్థానికులు ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించగా చికిత్స పొందుతూ లిఖిత్ తుదిశ్వాస విడిచాడు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు. ఇరువురి మృతదేహాలకు ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో పోస్ట్‌మార్టం నిర్వహించి మృతుల కుటుంబ సభ్యులకు అందించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పండగ రోజు రెండు నిండు ప్రాణాలు కోల్పోవడంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది.
ఆటలంటూ అనంత లోకాలకు ...
మంగళవారం సాయంత్రం వడ్డవల్లి నుంచి విద్యుత్ ప్రభలు కోటప్పకొండకు పయనమయ్యే సమయంలో సరదాగా గడిపిన బిడ్డ ఆటలంటూ పొద్దు పొద్దునే వెళ్లి అనంత లోకాలకు వెళ్లావయ్యా అంటూ మృతుడు తోట సంతోష్‌కుమార్ తల్లిదండ్రులు జానకీరామ్, నాగేశ్వరమ్మ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. జానకీరామ్‌కు ఇరువురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. జానకీరామ్ కోళ్లఫారం, కారు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం వెళ్లదీస్తున్నారు. రెండువ కుమారుడు సంతోష్‌కుమార్ రోడ్డు ప్రమాదంలో పండుగ పూట మృతి చెందడం జీర్ణించుకోలేక విలపించారు.
ఒక్కగానొక్క కొడుకు..
ఒక్కగానొక్క మగబిడ్డ, వంశోద్ధారకుడ్ని లేకుండా చేశావా శివయ్యా.. అంటూ కూరపాటి లిఖిత్ తల్లిదండ్రులు సుధీర్, సుజాతలు విలపించారు. రోడ్డు ప్రమాద వార్త తెలియగానే మృతుడి తల్లి సుజాత ఇంటిలో స్పృహతప్పి పడిపోయింది. కూరపాటి సుధీర్, సుజాత దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. సుధీర్ పట్టణంలో ఫ్యాన్సీ దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆడుకునేందుకు స్నేహితుడితో కలిసి వెళ్లి రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి చెందటంతో జీర్ణించుకోలేక లిఖిత్ మృతదేహన్ని గుండెలకు హత్తుకుంటూ రోదించారు.
ట్రాక్టర్‌ను ఢీకొని ఇద్దరు బాలురుదుర్మరణం
క్రికెట్ ఆడుకునేందుకు
వెళ్లి వస్తుండగా ఘటన
పండుగ పూట రెండు కుటుంబాల్లో విషాదం
విధి ఆటలో నలిగిన స్నేహం
Comments
Please login to add a commentAdd a comment