●భక్తజన సంద్రంగా మారిన కోటప్పకొండ
●ప్రభుత్వ స్టాల్స్‌ను ప్రారంభించిన
కలెక్టర్ అరుణ్‌బాబు
●ఉదయం 11.35 గంటలకే
హైటెన్షన్ లైన్ దాటిన ప్రభలు
● సత్రాలలో భక్తులకు అన్నప్రసాదం పంపిణీ
● 10ఆర్ మేజర్ కాల్వలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు
నరసరావుపేట ఈస్ట్: అన్ని దారులు శివయ్య సన్నిధికే.. కోటప్పకొండలో కొలువైన శ్రీత్రికేటేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులతో కోటప్పకొండ భక్తజన సంద్రంగా మారింది. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని బుధవారం కోటప్పకొండకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ జరిగే ప్రభల తిరునాళ్ల జాగరణకు ఉమ్మడి గుంటూరుజిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి యా త్రికులు అధికసంఖ్యలో వచ్చారు. కొండకు వెళ్లే రోడ్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ మార్గాలలో భక్తుల సందడి అధికంగా కనిపించింది. నరసరావుపేట, చిలకలూరిపేట నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపింది.
తరలివచ్చిన భారీ ప్రభలు..
జాగరణకు చిలకలూరిపేట వైపు నుంచి వచ్చే భారీ విద్యుత్ ప్రభలు ఉదయం 11.35గంటల సమయానికి ఈటీ వద్ద నున్న హైటెన్షన్ విద్యుత్ లైన్ దాటి కొండదిగువ భాగంలోని మైదానంలో శివయ్యకు అభిముఖంగా కొలువుదీరాయి. కావూరు, అప్పాపురం, అమీన్‌సాహెబ్‌పాలెం, గోవిందాపురం, లింగంగుంట్ల, పురుషోత్తపట్నం తదితర గ్రామాల నుంచి భారీ ప్రభలు కొండకు చేరుకున్నాయి. ప్రభల రాక సమయంలో చిలకలూరిపేట రోడ్డులో ట్రాఫిక్ నిలిచి పోవటంతో ఆర్టీసీ బస్సులు లేక భక్తులు వేచి ఉండాల్సి వచ్చింది.
వెల్లివిరిసిన మతసామరస్యం
వివిధ ప్రభుత్వ శాఖలు స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ద్వారా తమ శాఖలు అందించే పథకాలు, వసతులను భక్తులకు వివరించారు. ఆయా స్టాల్స్‌ను జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ప్రారంభించారు. కొండ దిగువన వివిధ సామాజిక వర్గాలకు చెందిన సత్రాలలో ఉచిత అన్న ప్రసాద వితరణ చేపట్టారు. అలాగే రోడ్డు మార్గంలో పలు సంస్థలు భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటు చేశారు. గురవాయపాలెం సమీపంలోని ఖాదర్‌వలి బాబా దర్గా వద్ద అన్నదానం ఏర్పాటు చేసి మత సామరస్యం చాటారు. ముస్లింలు ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పిలుస్తూ భోజనం వడ్డించారు. మెట్ల మార్గం ప్రారంభంలోని కేశఖండనశాల వద్ద భక్తుల రద్దీ కనిపించింది. భక్తులు అధికసంఖ్యలో తలనీలాలను సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
పుణ్యస్నానాలు..
తిరునాళ్లలో భాగంగా ఏర్పాటు చేసిన బొమ్మల దుకాణాల వద్ద చిన్నారులు తమ తల్లిదండ్రులతో వెళ్లి బొమ్మలు కొనుగోలు చేసారు. గ్రామీణ నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో నిరంతరం భక్తులకు తాగునీరు సరఫరా చేశారు. కొండ దిగువన చిలకలూరిపేట 10ఆర్ మేజర్ కాల్వలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కాలువలో పూర్తిస్థాయి నీరు ప్రవహిస్తుండటంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు గజ ఈతగాళ్లను అప్రమత్తంగా ఉంచారు. సీ్త్రలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో కొండకు వెళ్లే రోడ్డు మార్గంలో మూడంచెలుగా చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసి ప్రైవేటు వాహనాల రద్దీని తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు. కొండ దిగువన ప్రైవేటు వాహనాలను కట్టడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment