భక్తజన సంద్రం.. కాకాని శివాలయం
పెదకాకాని: పెదకాకాని శైవక్షేత్రం మహాశివరాత్రి సందర్భంగా బుధవారం భక్తజనం పరవశంతో పులకించింది. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భక్తుల కోసం ఆలయ డెప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ నేతృత్వంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారు స్వర్ణకవచాలంకృత భ్రమరాంబదేవిగా భక్తులను అనుగ్రహించారు. స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, సేవలు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున స్వామి దివ్యకల్యాణోత్సవం వైభవంగా జరిగింది. బుధవారం ఒక్కరోజులో స్వామికి వివిధ సేవా కార్యక్రమాల ద్వారా 6,50,000 రూపాయల ఆదాయం సమకూరినట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. బుధవారం రాత్రి కూచిపూడి నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. దాతల సహకారంతో ఉచిత అన్నప్రసాద వితరణ చేశారు. పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పులిహోర, పొంగలి, దద్దోజనం పంపినీ ఉదయం నుంచి రాత్రివరకూ సాగుతూనే ఉంది. స్వామి దర్శనానికి క్యూలైన్లలో వేచి ఉన్న చిన్న పిల్లలకు పాలు, భక్తులకు మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. హైకోర్టు న్యాయమూర్తులు గుణరంజన్, హరిహరనాథ్‌శర్మ, ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్రకుమార్, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తదితరులు స్వామిని దర్శించుకున్నారు.
నేడు రథోత్సవం
పెదకాకానిలో గురువారం స్వామి దివ్య రథోత్సవం జరుగుతుందని ఆలయ డీసీ గోగినేని లీలాకుమార్ తెలిపారు. ఆలయంలో భ్రమరాంబ అమ్మవారు అన్నపూర్ణ దేవి అలంకారంలో భక్తులను కటాక్షిస్తారని వివరించారు.
పెదకాకాని శ్రీ మల్లేశ్వరస్వామి మూలవిరాట్
భక్తజన సంద్రం.. కాకాని శివాలయం
Comments
Please login to add a commentAdd a comment