ఓటమి భయంతోనే కూటమి దాడులు
నరసరావుపేట: ఉమ్మడి గుంటూరు–కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి భయంతో అధికార పార్టీ నాయకులు బరితెగించారని సీఐటీయూ నాయకులు పేర్కొన్నారు. పీడీఎఫ్ అభ్యర్థికి చెందిన ఏజంట్లపై దాడులకు పాల్పడ్డారని తెలిపారు. పల్నాడురోడ్డులో పోలింగ్ బూత్ సమీపంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ అహ్మద్ మాట్లాడుతూ... రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన ఈ ఎన్నికలలో టీడీపీ రాజకీయ నిరుద్యోగిని అభ్యర్థిగా నిలబెట్టి దౌర్జన్యానికి పాల్పడడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. టీడీపీ ఓటమి భయంతో రిగ్గింగ్ పాల్పడడం సిగ్గుచేటని చెప్పారు. నరసరావుపేట పట్టణం బరంపేట పోలింగ్ కేంద్రంలో స్వయంగా ఎమ్మెల్యే దగ్గర ఉండి కూలీలతో ఓట్లు వేయించడం దారుణమన్నారు. దీనిపై తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం దురదృష్టకరమని, అయినప్పటికీ కేఎస్ గెలుపు ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. సీఐటీ యూ నాయకుడు కొమ్ముల నాగేశ్వరరావుపై దాడి జరిగిందన్నారు. న్యాయవాదుల బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, న్యాయవాది బి.సలీమ్ మాట్లాడుతూ ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు ప్రలోభాలకు గురిచేశారన్నారు. ఎన్నికల అ క్రమాలపై పోలింగ్ కేంద్రంలో ఉన్న వెబ్ కెమెరాల ఆధారంగా విచారణ నిర్వహించి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ డి.శివకుమారి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధికి భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు. కూటమి నాయకులు మధ్యాహ్నం నుంచి దౌర్జన్యాలకు పాల్పడ్డారని, ఎమ్మెల్యే దగ్గర ఉండి ఓట్లు వేయించటం సిగ్గుచేటు అన్నారు. జిల్లా వ్యాప్తంగా 15 నుంచి 20 శాతం దొంగ ఓట్లు వేయించారన్నారు. ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి రెడ్‌బాషా మాట్లాడుతూ కూటమి నాయకులు దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారన్నారు. లక్ష్మణరావు గెలుపు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు అవుతుందన్నారు.
దొంగ ఓట్ల కోసం రంగంలోకి
ఎమ్మెల్యే దిగటం సిగ్గుచేటు
ప్రజాసంఘాల నాయకుల ఆరోపణ
ఓటమి భయంతోనే కూటమి దాడులు
Comments
Please login to add a commentAdd a comment