శాసనమండలి వ్యవస్థను కలుషితం చేసిన టీడీపీ
నరసరావుపేట: విద్యావంతులు, పట్టభద్రులను శాసనమండలికి పంపించాల్సిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తొలిసారిగా రాజకీయ నాయకులను పోటీకి నిలబెట్టి వ్యవస్థను కలుషితం చేసిందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గురువారం కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి స్థానిక మున్సిపల్ హైస్కూలులోని బూత్ వద్దకు వచ్చిన ఆయన సాధారణ ఓటర్లతో కలిసి అరగంటసేపు క్యూలో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం బూత్ బయట విలేకరులతో మాట్లాడారు. విద్యావంతులు, పట్టభద్రులను చట్టసభలకు పంపించి ప్రజలకు ఉపయోగపడే మంచి చట్టాలను అందించేందుకు రాజ్యాంగం శాసనమండలి అనే వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. వారిని ఎన్నికల ద్వారా మండలికి పంపే వీలును ప్రజలకు కల్పించిందన్నారు. అయితే టీడీపీ ఈ ఎన్నికల్లో కూడా రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులను పోటీలో నిలిపి వ్యవస్థను కలుషితం చేసిందన్నారు. బూత్‌లలో పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఏజెంట్లుగా కూర్చోబెట్టి దొంగ ఓట్లు పోల్ చేయించుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఓటర్ జాబితా కూడా తప్పుల తడకగా ఉందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, తక్షణమే పోలింగ్ అధికారులు, కలెక్టర్ స్పందించి అక్రమాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలను నిజాయతీగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ నాయకులు హాలీవుడ్ రఘు, అచ్చి శివకోటి ఉన్నారు.
ఆ పార్టీ అక్రమాలు అడ్డుకుని
ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి
మాజీ ఎమ్మెల్యే
డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
మున్సిపల్ హైస్కూలులో
ఓటు హక్కు వినియోగం
Comments
Please login to add a commentAdd a comment