ఎన్నికల హామీలకు పాతర
సాక్షి,నరసరావుపేట: ఎన్నికల్లో గెలవడానికి సూపర్–6తోపాటు అలవిగాని హామీలను ఎన్నింటినో ఇచ్చిన కూటమి ప్రభుత్వం తీరా వాటి అమలుకు అవసరమైన బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం మొండిచేయి చూపింది. కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో శుక్రవారం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రసంగం కోసం ఎదురుచూసిన ప్రజలకు నిరాశే మిగిలింది. సంక్షేమ పథకాలకు కేటాయింపులు చేస్తారని ఆశించిన పేదోడికి చేదువార్తను వినిపించారు. ముఖ్యంగా సూపర్–6 పథకాలను ఈ ఆర్థిక సంవత్సరమైనా అమలు చేస్తారనుకుంటే వాటి ప్రస్తావనే చేయలేదు. నెలనెలా రూ.1,500 కోసం జిల్లాలో 7,80,538 మంది మహిళలు ఎదురుచూస్తున్నారు. అలాగే ఉచిత బస్సు ప్రయాణం కోసం జిల్లాలో 10,92,752 మంది మహిళలు అర్హులున్నారు. ఇంటింటికి ఉద్యోగం లేదా ఉద్యోగం వచ్చే వరకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అంటూ ఇచ్చిన హామీ అమలు కోసం జిల్లాలో 6.51 లక్షల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వాటి ఊసేలేదని ఆయా వర్గాలు వాపోతున్నాయి. తల్లికి వందన, సుఖీభవ వంటి పథకాల ప్రస్తావన ఉన్నా వాటికి ఇచ్చిన అరకొర నిధులతో లబ్ధిదారుల వడపోతతో ఎంతమందికి మోసం చేస్తారో అనే భయం ప్రజల్లో మొదలైంది.
రాష్ట్ర బడ్జెట్‌లో టీడీపీ హామీలకుకేటాయింపులేవి మహిళకు ఆర్థిక సాయం, ఉచిత బస్సు పథకాల ఊసేది నిరుద్యోగులకు మరోసారి మొండిచేయి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొర కేటాయింపులు లబ్ధిదారుల జాబితాలో కోతలు ఉంటాయని భయపడుతున్న మహిళలు, రైతులు వరికపూడిశెల ప్రాజెక్ట్ పనులకు నిధులు కేటాయించని కూటమి సర్కార్
అన్నదాత సుఖీభవకు సరిపడా కేటాయింపులు లేవు...
వ్యవసాయ బడ్జెట్‌లో నిధుల కేటాయింపు నామమాత్రంగానే ఉంది. ఇది రైతులకు భరోసా ఇచ్చేదిగా లేదు. రైతుల సంక్షేమానికి అన్నదాత సుఖీభవ పేరుతో ప్రతి రైతుకి రూ.20,000 సహాయం అందిస్తామని ఊదరగొట్టారు. 2024 సంవత్సరంలో అమలు చేయలేదు. 2025 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ పఽథకంతో కలిపి రూ.9,400 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే కొంత మంది రైతులకు ఎగనామం పెట్టడమే. ముఖ్యంగా కౌలు రైతులను ఎలా గుర్తిస్తారో చెప్పలేదు.
– వై రాధాకృష్ణ, కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.
వరికపూడిశెలకు ఒక్క పైసా కూడా కేటాయించలేదు...
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పల్నాడు ప్రాంతానికి ఎంతో కీలకమైన వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఒక్క నయా పైసా కూడా కేటాయించకపోవడం దారుణం. వరికిపూడిసెల ఎత్తిపోతల ప్రాజెక్టుకు నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పలు శాఖల నుంచి అనుమతులు తీసుకుని వచ్చారు. వాటిని కొనసాగించి ఉంటే బాగుండేది.
–ఎంఎన్ ప్రసాద్,
సీనియర్ అడ్వకేట్, వినుకొండ.
సంక్షేమ పథకాలకు నిధులేవి..?
సుమారు రూ.3 లక్షల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పటికీ పేదలకు ఆసరాగా నిలిచే సంక్షేమ పథకాలకు కేటాయింపుల్లో రిక్తహస్తం చూపారు. ఇది కేవలం అంకెల గారడీ బడ్జెట్ మాత్రమే. ఎన్నికల హామీలైన సూపర్–6 పథకాలకు నిధులు కేటాయింపులు లేవు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవలకు తక్కువ నిధులు కేటాయింపులు చేశారు. మరి వీటిని ఎప్పుడు అమలు చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలి.
–కాసా రాంబాబు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, నరసరావుపేట.
వరికపూడిశెలకు కేటాయింపులేవి?
పల్నాడు ప్రజలకు ఎంతో కీలకమైన వరికపూడిశెలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నిధులు కేటాయింపులేదు. ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కీలకమైన ప్రాజెక్టు కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరికపూడిశెలకు అడ్డుగా ఉన్న అటవీ, పర్యావరణ అనుమతులు వచ్చేలా చూశారు. అంతేకాకుండా ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. దాన్ని కొనసాగించాల్సిన కూటమి ప్రభుత్వం నిధులు కేటాయింపులు చేయకుండా ప్రాజెక్టును అటకెక్కిస్తున్నారని జిల్లా వాసులు వాపోతున్నారు. సాగర్ కాలువల ఆధునికీకరణ, పులిచింతల ప్రాజెక్టు అవసరమైన నిధులు కేటాయింపులలో సైతం బడ్జెట్‌లో సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు. పర్యాటక, పారిశ్రామిక అభివృద్ధిలో జిల్లాకు ఏం చేస్తున్నారో పేర్కొనలేదు.
దివాళా కోరు బడ్జెట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తీరును గమనిస్తే దివాళాకోరుతనం స్పష్టంగా కన్పిస్తుంది. అన్నింటిలోనూ కోత పెట్టారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే సూపర్ సిక్స్ అమలుచేయాలనే దృక్పథం కన్పించటంలేదు.
–ఈదర గోపీచంద్, గ్రామ, వార్డు వలంటీర్ల సంఘ రాష్ట్ర గౌరవ సలహాదారు
ఎన్నికల హామీలకు పాతర
ఎన్నికల హామీలకు పాతర
ఎన్నికల హామీలకు పాతర
ఎన్నికల హామీలకు పాతర
Comments
Please login to add a commentAdd a comment