ఉపమాసం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఉపమాసం ప్రారంభం

Published Sun, Mar 2 2025 2:15 AM | Last Updated on Sun, Mar 2 2025 2:12 AM

ఉపమాస

ఉపమాసం ప్రారంభం

● మాసమంతా మహిమాన్వితమే! ● నేటి నుంచి నెలరోజులు కఠోర ఉపవాస దీక్షలు, దానధర్మాలు ● మత సామరస్యానికి ప్రతీక రంజాన్‌

యడ్లపాడు: రంజాన్‌ మాసం ముస్లింల జీవితాల్లో అత్యంత పవిత్రమైనది. చేతికి దానం..బుద్ధికి భక్తి..దేహానికి క్రమశిక్షణ..మనసుకు ప్రేమ ఒక్క నెలరోజులు అలవాటు చేసే అపురూపు మాసమిది. హీజ్రీ క్యాలెండర్‌ ప్రకారం రమజాన్‌ అన్నది సంవత్సరంలోని 12 నెలల్లో 9వ నెల పేరు. షాబాన్‌ మాసం ముగిసే చంద్ర దర్శనంతో రంజాన్‌ మాసం ఆరంభమవుతోంది. ముస్లింలందరూ నెలరోజులు రోజాతో ఆధ్మాత్మిక చింతన, భక్తిశ్రద్ధలతో గడిపే మాసం రంజాన్‌. ఈనెల ఆధ్యాత్మిక ప్రయాణానికి, మనో నిగ్రహానికి, మానవీయతకు ప్రతీక. శనివారం నెలవంక దర్శనం అయింది. దీంతో ఆదివారం నుంచి రోజా (ఉపవాసవ్రతం) ముస్లింలు చేపడతారు.

సహరీతో ఆరంభం ఇఫ్తార్‌తో విరమణ

సూర్యోదయానికి ముందే తీసుకునే ఆహారం(సహరీ) అనంతరం భగవంతుని అనుగ్రహాన్ని పొందే ఉద్దేశంతో ఉపవాసాన్ని పాటిస్తారు. దివ్య సూర్యకిరణాలు నడుస్తూ సాగిన అనంతర ఘడియలలో, దాహాన్ని, ఆకలిని అనుభవిస్తూ ఇబాదత్‌ ద్వారా మనస్సును నిర్మలంగా మార్చుకుంటారు. సూర్యాస్తమయం (ఇఫ్తార్‌) కాగానే కుటుంబసభ్యులు అంతా కలిసి సామూహికంగా పండ్లు, ఫలహారాలతో దీక్షను విరమిస్తారు. ఇది భౌతిక అవసరాలను మాత్రమే కాదు, మానసిక స్థైర్యాన్ని కూడా పరీక్షించే సమయం.

వీరికి మినహాయింపు..

రంజాన్‌ నెలలో బలమైన కారణం లేకుండా ఒక్క రోజాను వదిలేసినా ఇక తర్వాత ఏడాదంతా ఉపవాపం పాటించినా సరే..దానితో సరితూగదన్నది ప్రవక్త బోధనల సారాంశం. అయితే బాలింతలు, రుతుక్రమంలో ఉన్న సీ్త్రలు, రోగులకు ఇలా కొందరికి మాత్రం మినహాయింపు ఉంది. వీళ్లు ఉపవాసాలు చేయకపోయినా మిగతా రోజుల్లో పాటించి, ఆ సంఖ్యను పూరించాలన్నది ఖురాన్‌ ఉద్బోధ.

నెలవంక దర్శనం.. దీక్షలు ప్రారంభం

యడ్లపాడు: అత్యంత పవిత్రమైన రంజాన్‌ మాస ఉపవాస దీక్షలు (రోజా) ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలో శనివారం సాయంత్రం మగ్రిబ్‌ నమాజు అనంతరం ముస్లింలు నెలవంక దర్శనం చేసుకుని ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. మసీదులు, మదరసాలు, ముస్లిం వాడల్లో రంజాన్‌ ఆధ్యాత్మిక శోభ మొదలైంది. చంద్రదర్శనంతో ప్రత్యేక దువాలు నిర్వహించి, రోజా దీక్షను నిష్టగా కొనసాగించేలా అల్లాహ్‌ అనుగ్రహించాలని భక్తులు ప్రార్థించారు.

దయాగుణం..

రంజాన్‌ సాధారణ జీవితం నుంచి సమాజానికి ఉపయోగపడే సద్గుణాలను నింపి వారిలో దానగుణాన్ని పెంపొందిస్తుంది. సోదరభావాన్ని కలిగిస్తుంది. ఇదే ఇస్లాం మూలసూత్రాల్లో ప్రధానమైన లక్ష్యం. ఈ మాసంలో చేసే ఒక్కో ఆధ్మాత్మిక, సేవా కార్యానికి అల్లా 70 రెట్లు అధిక పుణ్యఫలం ప్రసాదిస్తారని ప్రవక్త బోధించారు. తమ సంపాదనలో 2.5 శాతం ధనాన్ని పేదలకు పంచాలని అల్లాహ్‌ ఖురాన్‌లో శాసనం చేశారు. సదఖా, జకాత్‌, ఫిత్రా దానాల ద్వారా ఈనెలలో పేదలకు ఆర్థిక సాయం విరివిగా అందుతుంది. దీంతో వారి అవసరాలు తీరి ఆనందోత్సవాలతో పండుగను జరుపుకొంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఉపమాసం ప్రారంభం1
1/1

ఉపమాసం ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement