లింగ నిర్ధారణకు పాల్పడితే కేసులు | - | Sakshi
Sakshi News home page

లింగ నిర్ధారణకు పాల్పడితే కేసులు

Published Sun, Mar 2 2025 2:15 AM | Last Updated on Sun, Mar 2 2025 2:12 AM

లింగ

లింగ నిర్ధారణకు పాల్పడితే కేసులు

నరసరావుపేట: జిల్లాలో గర్భస్థ లింగ నిర్ధారణకు పాల్పడే వారిపై కేసులు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకుంటామని మల్టీ మెంబెర్‌ అప్రాప్రియేట్‌ అథారిటీ డిస్టిక్‌ లెవెల్‌ అడ్వైజరీ కమిటీ చైర్మన్‌, జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు హెచ్చరించారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన కమిటీ సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. అన్నీ స్కానింగ్‌ సెంటర్లలో తనిఖీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 175 ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు లింగ నిర్ధారణ చట్ట పరిధి కింద అనుమతులు ఇవ్వటం జరిగిందని, వీరందరూ కూడా నిబంధనలకు లోబడి అన్నీ రకాల రికార్డులను సక్రమంగా అమలు చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో నూతనంగా రెండు స్కాన్‌ సెంటర్లు, రెండు రెన్యువల్స్‌కు, తొమ్మిది మార్పులకొరకు దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతులు మంజూరు చేశారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ బి.రవి, నోడల్‌ అధికారి డాక్టర్‌ బి.గీతాంజలి, సత్తెనపల్లి గైనకాలజిస్టు డాక్టర్‌ శోభారాణి, డాక్టర్‌ లక్ష్మణరావు, డాక్టర్‌ గిరిరాజు, డెప్యూటీ డెమో కె.సాంబశివరావు, షేక్‌ ఖాజావలి పాల్గొన్నారు.

డీటీఓ శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరణ

నూతన జిల్లా ఖజానా, అకౌంట్స్‌ అధికారిగా కె.శ్రీనివాసరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ పి.అరుణ్‌బాబును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

ముగిసిన బ్రహ్మోత్సవాలు

అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమరావతిలో వేంచేసియున్న బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం పూర్ణాహుతితో ముగిశాయి. తొలుత స్వామివారికి చూర్ణోత్సవంలో భాగంగా ఉత్సవమూర్తులకు స్నపన చేసి నూతన వస్త్రాలంకరణ చేశారు. అనంతరం స్వామివారికి వసంతోత్సవం నిర్వహించారు. ఆలయస్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ మాట్లాడుతూ రథోత్సవం పూర్తయిన స్వామివారికి చూర్ణోత్సవం, వసంతోత్సవం నిర్వహించటం ఆనవాయితీగా వస్తుందన్నారు. అనంతరం నిర్వహించే పూర్ణాహుతితో పంచాహ్నిక దీక్షతో నిర్వహించే బ్రహ్మోత్సవాలు ముగిశాయన్నారు. అలాగే రాత్రి 10 గంటలకు నిర్వహించే ధ్వజారోహణ కార్యక్రమంతో స్వామివారి ఏకాంతసేవా మహోత్సవాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. వసంతోత్సవ అనంతరం స్వామివారిని పల్లకీలో గ్రామోత్సవం నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

‘భరోసా’ తగ్గించారు

తొమ్మిది నెలల్లో 10,161 పింఛన్ల తొలగింపు

నరసరావుపేట: ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పొందే వారి సంఖ్య జిల్లాలో క్రమంగా తగ్గిపోతుంది. గత తొమ్మిది నెలల కాలంలో 10,161మంది పింఛన్లను కూటమి సర్కారు కోత వేసింది. ఫిబ్రవరితో పోల్చితే మార్చి నెలకు 977 పింఛన్లు తగ్గాయి. గత నెల 2,72,932 మందికి అందజేయగా ఈనెల 2,71,955 మందికి అందజేయాల్సివుంది. ఒకటో తేదీ శనివారం నుంచి జిల్లాలో పంపిణీ మొదలు పెట్టగా సాయంత్రానికి 2,51,008 (92.30శాతం) మందికి అందజేశారు. జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు నరసరావుపేట పట్టణంలో స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు. గత ప్రభుత్వం ముగిసి నూతన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి జిల్లా వ్యాప్తంగా 2,82,126మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి గతేడాది జూలై మొదటి తేదీన నూతన ప్రభుత్వం పింఛన్లు అందజేసింది. ప్రస్తుత నెల లబ్ధిదారులతో పోల్చితే తొమ్మిది నెలల్లో 10,161మంది లబ్ధిదారులు తగ్గటం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
లింగ నిర్ధారణకు  పాల్పడితే కేసులు 1
1/1

లింగ నిర్ధారణకు పాల్పడితే కేసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement