మోసంలో పీహెచ్‌డీ చేసిన బాబు
నరసరావుపేట: రాష్ట్రంలో టీడీపీ కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ తీరు గమనిస్తే గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎక్కడ నిలబెట్టుకోకుండా మోసం చేశారని, అందులో ఆయన పీహెచ్‌డీ చేశారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తల్లికి వందనం పథకానికి 80 లక్షల మంది విద్యార్థులకు రూ.13,113 కోట్లు అవసరమైతే కేవలం రూ.9407కోట్లు మాత్రమే కేటాయించి దాదాపు 24 లక్షల మంది విద్యార్థులకు పంగనామం పెట్టబోతున్నారన్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి 55 లక్షల మంది రైతులకు రూ.10,717 కోట్లు అవసరం కాగా, బడ్జెట్‌లో రూ.6,300 కోట్లు కేటాయించారంటే 22 లక్షల మంది అన్నదాతలకు ఎగనామం గ్యారెంటీ అన్నారు. దీపం పథకానికి ఈ ఏడాది రూ.4వేల కోట్లు అవసరమైతే రూ.2,600 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు. 1.50 లక్షల దీపం కుటుంబాలు ఉంటే 90 లక్షల మందికి నిధులు కేటాయించి 58 లక్షల పైచిలుకు మందికి ఎగ్గొడుతున్నారన్నారు. ఉచిత బస్సుకు రూ.3,600 కోట్లు అవసరమైతే ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, అసలు ఈ పథకం అమలు చేస్తారా లేదా అనేది తెలియని సందిగ్ధం నెలకొందని గోపిరెడ్డి పేర్కొన్నారు. గత 20ఏళ్ల నుంచి చంద్రబాబు ఎన్నికల ముందు ఎప్పడూ నిరుద్యోగ భృతి ఇస్తానని చెబుతూనే ఉన్నాడని, ఇంతవరకు ఎక్కడా ఈ పథకాన్ని నెరవేర్చిన పాపాన పోలేదని, ఈ బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి ఊసేలేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ ,బీసీ మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్ అమలుచేస్తానని వాగ్దానం చేసి బడ్జెట్‌లో ప్రస్తావించలేదని అన్నారు. నాడు–నేడు పథకానికి రూ.8వేల కోట్లు అవసరమైతే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.4వేల కోట్లు కేటాయించారని, మరో రూ.4వేల కోట్లు కేటాయిస్తే మిగిలిన పనులు పూర్తయ్యేయని, కానీ బడ్జెట్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కేవలం రూ.100కోట్లు మాత్రమే కేటాయించారని వివరించారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఎన్నికల ముందు వాగ్దానం చేశారని, ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదని అన్నారు.
ఉద్యోగులకు ద్రోహం
ఉద్యోగులకు 29 శాతం ఐఆర్, 23 శాతం పీఆర్సీ గతంలో వైఎస్ జగన్ ప్రకటించారని, 23 శాతం అందించడం జరిగిందనీ, కానీ ప్రస్తుత ప్రభుత్వం దీనిపై కనీసం ఒక ప్రకటన కూడా చేయలేని స్థితిలో ఉందని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఉద్యోగస్తుల్లో ఈ విషయంపై తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉన్నా ప్రస్తుతం ఎవరూ బయటపడటంలేదనీ అన్నారు.
వరికెపుడిశెల ప్రాజెక్టుకు తీరని అన్యాయం
ఉద్యోగులు, నిరుద్యోగులకూ మోసం
మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజం
సూపర్ 6ను మడతేసిన కూటమి సర్కారు
డీఎస్సీ ఊసేదీ?
ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైనా మెగా డీఎస్సీ ఊసే లేదనీ, ఎన్‌టీఆర్ భరోసా పింఛన్లకు రూ.5వేల కోట్లు తగ్గించారని, రానున్న రోజుల్లో సుమారు 10 లక్షల పింఛన్ల ఎత్తివేతకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని గోపిరెడ్డి విమర్శించారు. మొత్తం మీద చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు అన్నిటికీ పంగనామం పెట్టారని ఎద్దేవా చేశారు. వరికెపుడిశెల ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేశారన్నారు. పల్నాడు ప్రాంతానికి ఈ బడ్జెట్లో తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment