కూటమి బడ్జెట్ మోసపూరితం
వినుకొండ: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం మోసమేనని వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని పథకాలూ అమలు చేస్తామని చంద్రబాబు, హామీలు కచ్చితంగా అమలు చేసేలా చూసుకుంటామని పవన్ మాట్లాడిన మాటలను ప్రజలు మర్చిపోలేదని పేర్కొన్నారు. కనీసం ప్రటించిన పథకలకన్నా పూర్తిస్థాయి కేటాయింపులు చేయలేకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ వంటి పథకాలకు సగం నిధులను కేటాయించడం, మహిళలకు ఉచిత బస్సు, ప్రతి మహిళకు ప్రతి నెలా రూ.1500 ఇస్తామని నమ్మబలికి వాటి ప్రస్తావనే బడ్జెట్‌లో లేకపోవడం ప్రజలను దగా చేయడమేనని బొల్లా విమర్శించారు. పల్నాడు ప్రాంతానికి జీవనాడిలాంటి వరికపూడిశెల ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించకపోవడంపై బొల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో వరికపూడిశెల పథకానికి అన్ని రకాల అనుమతులను తీసుకురావడంతోపాటు శంకుస్థాపన చేసి కొంత నిధులనూ కేటాయించామని వివరించారు. ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన నెలలోనే వరికపూడిశెల పూర్తిచేస్తామని ప్రగల్భాలు పలికారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి ప్రతిపక్షాలపై పగ తీర్చుకోవడానికే సమయం సరిపోతోందని, పాలనను పట్టించుకోవడం లేదని బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై ప్రభుత్వం వేధింపులకు దిగుతోందని, పోలీసులు దీనికి వంతపాడుతున్నారని బొల్లా ధ్వజమెత్తారు.
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు
Comments
Please login to add a commentAdd a comment