వైఎస్సార్‌సీపీ రైతు విభాగ జిల్లా అధ్యక్షులు పున్నారెడ్డి
నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్ చూస్తే కూటమి సర్కారుకు చిత్తశుద్ధి ఉన్నట్టు కనపడడం లేదని వైఎస్సార్‌సీపీ రైతు విభాగ జిల్లా అధ్యక్షులు అన్నెంపున్నారెడ్డి విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. అన్నదాత సుఖీభవ పథకానికి రూ.10,700కోట్లు కావాల్సి ఉండగా, కేవలం రూ.6,300 కోట్లు కేటాయించడమేమిటని ప్రశ్నించారు. ధరల స్థిరీకరణ నిధికి కేవలం రూ.300కోట్లు మాత్రమే కేటాయించారని, అదే గత ప్రభుత్వంలో రూ.3వేల కోట్లు కేటాయించారని వివరించారు. ప్రకృతి వైపరీత్యాల సహాయనిధి, రైతు సేవా కేంద్రాల గురించి బడ్జెట్లో ఊసేలేదని విమర్శించారు. భూసార పరీక్షలు చేసే అగ్రి ల్యాబ్ నిర్వహణకూ నిధులు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో రైతులు గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ ఆయకట్టు కింద కొన్ని వేల ఎకరాల్లో రెండో పంట సాగు చేశారని, సాగునీరు విషయంలో అవగాహన లేకుండా అధికారులు వారబందిగా సాగునీరు ఇస్తామని ప్రకటన చేశారని విమర్శించారు. గత ప్రభుత్వం కౌలు రైతులకూ పథకాలు వర్తింపజేసిందని, కూటమి ప్రభుత్వం ఆ విషయం గురించి మాట్లాడడం లేదని ధ్వజమెత్తారు.. ఇప్పటికై నా రైతులకు న్యాయం చేయకపోతే వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లాలోని మిగతా నియోజకవర్గ ఇన్‌చార్జీల అందరితో కలిసి రైతు పోరుబాట కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment