పట్టభిషేకం ఎవరికో!
నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల(ఏసీ)లోని కౌంటింగ్ కేంద్రంలో భద్రపరచిన బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదివారం ఏసీ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపుపై సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం జేసీ ఎ.భార్గవ్ తేజతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగలక్ష్మి మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘ ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు చేపడుతున్నామని, ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ఆమె తెలిపారు. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన అనంతరం అన్ని జిల్లాల బ్యాలెట్ బాక్సులు ఏసీ కళాశాలలోని స్ట్రాంగ్ రూములోకి భద్రపర్చినట్లు చెప్పారు. పోలింగ్ 69.57 శాతంగా నమోదైన దృష్ట్యా దాదాపు 2.41 లక్షల ఓట్లు లెక్కించాల్సి ఉందన్నారు.
28 టేబుళ్లు ఏర్పాటు
ఇందుకు 28 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. బ్యాలెట్ పేపర్, మొదటి ప్రాధాన్యత ఓట్లు విధానంతో లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రక్రియ ప్రకారం కౌంటింగ్ సుమారు రెండు నుంచి మూడు రోజులు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రాథమికంగా కౌంటింగ్ మొదటి రౌండ్‌లో పోలింగ్ బూత్‌ల వారీగా పోలైన ఓట్లను సరిచూసుకొని మిక్సింగ్ చేస్తారన్నారు. తదుపరి చెల్లుబాటయ్యే ఓట్లను పరిశీలించి, మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించడం జరుగుతుందన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి నిర్దేశించిన కోటా ఓట్లు వచ్చిన అభ్యర్థి గెలుపొందినట్టు ప్రకటించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు ఎవరికీ నిర్దేశిత ఓట్లు రాకపోతే ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ వారికి వచ్చిన తదుపరి ప్రాధాన్యత ఓట్లను ఇతర అభ్యర్థులకు పంచుతూ కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు.
మూడు షిఫ్టుల్లో 750 మందికి విధులు..
ఓట్లు లెక్కింపు కోసం మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించేలా 750 మంది సిబ్బందికి వివిధ విధులను కేటాయించినట్లు తెలిపారు. అభ్యర్థులు సైతం ఏజెంట్లను మూడు షిఫ్టుల్లో నియమించుకునేలా అవకాశం కల్పించామన్నారు. కౌంటింగ్ ప్రదేశం మొత్తం మూడంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, గుర్తింపు కార్డు లేకుండా ఏ ఒక్కరిని కౌంటింగ్ ప్రాంతానికి అనుమతించబోమన్నారు. అదే విధంగా కౌంటింగ్ హాల్లోకి సెల్‌ఫోన్లు అనుమతించరని, పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన తర్వాతే కౌంటింగ్ హాల్లోకి ఏజెంట్లను, కౌంటింగ్ సిబ్బందిని అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు తెలియజేసేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. వీటితో పాటు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.
ఏసీ కళాశాల కౌంటింగ్ కేంద్రంలో పూర్తయిన ఏర్పాట్లు ఉమ్మడి కృష్ణా–గుంటూరు జిల్లాల ఓట్ల లెక్కింపు ఇక్కడే 2.41 లక్షల ఓట్లను లెక్కించేందుకు 28 టేబుళ్లు ఏర్పాటు వివరాలు వెల్లడించిన ఆర్‌ఓ, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి
పట్టభిషేకం ఎవరికో!
Comments
Please login to add a commentAdd a comment