మెప్పించని రాష్ట్ర బడ్జెట్
నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మెజారిటీ ప్రజలను మెప్పించలేకపోయిందని ప్రజాసంఘాల నాయకులు పేర్కొన్నారు. కేటాయింపులకు, ఖర్చులకు పొంతన లేని బడ్జెట్ అని పలువురు వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక కోటప్పకొండరోడ్డులోని సీపీఎం కార్యాలయంలో దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం(పీడీఎం) జిల్లా అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి అధ్యక్షతన రాష్ట్ర బడ్జెట్‌పై చర్చా గోష్టి నిర్వహించారు. పీడీఎం రాష్ట్ర నాయకుడు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. 70 శాతానికిపైగా ఉన్న వ్యవసాయ రంగానికి ఏడు శాతం నిధులు కేటాయించడం సరికాదన్నారు. ఎస్‌సీ, ఎస్‌టీలకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో వరికెపూడిశెల ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం కూటమి నేతల ప్రాధాన్యతలు వేరని చెబుతోందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ వర్గాలకు ఇచ్చే రాయితీలు ఎన్నటికీ పేదలకు ఇవ్వబోమని చెప్పినట్లుగా బడ్జెట్ ఉందని తెలిపారు. బడ్జెట్ అంకెలు గారడీ మినహా మరేం కాదని అన్నారు. వరికపూడిశెల ప్రాజెక్ట్‌కు వెంటనే నిధులు కేటాయించి పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు కోసం సరైన కేటాయింపులు చేయలేదని విమర్శించారు. తల్లికి వందనం పేరిట ప్రతి విద్యార్థికి రూ.15 వేలు, అన్నదాతా సుఖీభవ కింద ఏటా రైతులకు పెట్టుబడి సాయంగా రూ.20 వేలు ఇస్తామని చెప్పినా అందుకు తగిన నిధులు కేటాయించలేదని అన్నారు. కేంద్రం ఇచ్చే మొత్తంతో కలిపి రూ.20 వేలు ఇస్తామని కూటమి ప్రభుత్వం మాట మార్చడం ప్రజల్ని వంచించడమేనని పేర్కొన్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏవూరి గోపాలరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పచ్చవ రామారావు, సీఐటీయూ నాయకులు షేక్ సిలార్ మసూద్, పౌర హక్కుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చికినం చిన్న, ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.కోటనాయక్ ప్రసంగించారు. కార్మికులు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, దళితులు, గిరిజనులను ఈ బడ్జెట్ నిరాశకు గురిచేసిందని విమర్శించారు. లోపాలను సరిచేసి పేదలకు బడ్జెట్‌లో తగిన కేటాయింపులు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. పీడీఎం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సూపర్ సిక్స్ పథకాల అమలుకు తగిన నిధుల కేటాయింపులో గారడీలు 70 శాతం మంది ఆధారపడిన సాగు రంగానికి 7 శాతమే నిధులా? చర్చా గోష్టిలో కూటమి ప్రభుత్వ తీరుపై ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment