గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్టు
మరో ఇద్దరు పరారీ
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతానగరం రైల్వే బ్రిడ్జి సమీపంలో గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారయ్యారు. ఈ సంఘటనపై సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కల్యాణ్ రాజు వివరాలు వెల్లడించారు. విజయవాడలోని విద్యాధరపురానికి చెందిన గుమ్మడి సాయికుమార్ మరో ఇద్దరు యువకులు గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో కలసి సీతానగరం రైల్వే బ్రిడ్జి వద్దకు వెళ్లామని తెలిపారు. ఈ దాడిలో సాయికుమార్ వద్ద 1050 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఉండవల్లికి చెందిన మహేష్, విజయవాడకు చెందిన కోటి పరారయ్యారని పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్న సాయికుమార్‌ను కోర్టుకు హాజరు పరచనున్నామని తెలిపారు. గంజాయి అమ్మకాలతో పాటు తాగే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment