సన్మార్గ దర్శిని దివ్య ఖురాన్
చిలకలూరిపేట: ప్రపంచంలోని ముస్లింలందరికీ నెలరోజుల పండుగ రంజాన్. దివ్యఖురాన్ దైవం నుంచి భువికి అవతరించిన మాసం కూడా ఇదే. ఈ పవిత్ర గ్రంథం వెలుగులో ఆత్మప్రక్షాళన చేసుకొనే అవకాశం కల్పిస్తుంది. సాఫల్య జీవితానికి సోఫానం దివ్యగ్రంథం పవిత్ర ఖురాన్. అల్లా నుంచి అవతరించి భూమిపైకి వచ్చిన గ్రంథం కావటంతో దీనిని దివ్యఖురాన్ అంటారని మౌల్వీలు పేర్కొంటున్నారు. మానవుడు ఉన్నత జీవితం గడిపేందుకు అవసరమైన అన్ని సూచనలు, నియమాలు ఇందులో పొందుపరిచి ఉన్నాయి. ప్రాపంచిక విషయాల్లో ఎదురయ్యే ఎలాంటి ఒడిదుడుగులకై నా ఈ గ్రంథంలో పరిష్కార మార్గం ఉంటుంది. మానవ సంబంధాలు, శాంతియుత జీవనం, అహింస, విశ్వసనీయత, సౌభ్రాతృత్వం, రోజువారీ జీవితం ఎలా గడపాలి వంటి ఇహలోక అంశాలతో పాటు పరలోక సౌఖ్యం పొందటానికి అవసమైన మూలసూత్రాలు ఇందులో పొందుపరిచి ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇహ, పరలోకాల సౌఖ్యం, సాఫల్య జీవితానికి మూల సూత్రాలే దివ్యగ్రంథంలోని ప్రధాన అంశాలు. పవిత్ర ఖురానులో సూచించిన మార్గాన్ని మహమ్మద్ ప్రవక్త అనుసరించారు. ఈ లోకానికి ఆచరించి చూపారు. దివ్యఖురాన్ రంజాన్ మాసంలో అవతరించటంతో ముస్లింలు ఈ మాసంలో ఖురాన్‌ను పఠిస్తూ దాని పవిత్రతను చాటుతుంటారు. ఖురాన్‌లో 114 సూరాలు, 6,666 ఆయాత్‌లు, 540 రుకూలు ఉంటాయి. సంపూర్ణ గ్రంథాన్ని 30 భాగాలుగా విభజించారు. వాటిని పారాలుగా పేర్కొంటారు. రంజాన్‌మాసంలో తరావి నమాజు కింద పూర్తిపఠనం గావిస్తారు.
మహిమాన్విత వరం..
దైవం దివ్యఖురానును ప్రపంచ మానవాళికి మహిమాన్విత వరంగా ప్రసాదించారు. అజ్ఞానపు కారుచీకట్ల నుంచి విజ్ఞానమనే వెలుగు బాటను చూపిన ఈ దివ్య గ్రంథం మానవుడి అవివేకాన్ని తుడిచిపెట్టేందుకు ఉత్తమమైన మార్గంగా నిలుస్తోంది. మామూలు వ్యక్తిని కూడా మహోన్నతునిగా మార్చేందుకు దోహదపడుతుంది. ఈ దివ్యగ్రంథంలో మొత్తం 30 భాగాలు ఉంటాయి. మొదటి భాగం ‘ఎఖ్రా’ (విద్య) సంబంధించినది. దీని ద్వారా ప్రతి ఒక్కరికీ చదువు తప్పనిసరి అన్న సూచన అందుతోంది. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు అనుసరించాల్సిన విధుల గురించి ఈ సూచనలు ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఈ మాసంలో ధనికులు జకాత్, ఫిత్రాలను ఖచ్చితంగా అందజేస్తే రంజాన్ ఈద్ ప్రార్థన సమయానికి పేదలనే వారు ఉండరని ఈ గ్రంథం వివరిస్తుంది. మానవుడిలోని మద్యపానం, వ్యభిచారం, పాపం, ద్రోహం, హింస, చెడుగా మాట్లాడటం, కించపరచాలనుకోవటం వంటి విషయాలను ఈ గ్రంథం తీవ్రంగా నిరసిస్తుంది. నైతిక విలువలతో జీవించాలని ప్రభోదిస్తుంది. ఖురాన్‌ను చదివి, దానిని పాటించేవారికి స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని మౌల్వీలు చెబుతారు. పఠించేవారికి ప్రశాంతతో పాటు మనశ్శాంతి లభిస్తుందని విశ్వాసుల నమ్మకం.
సాఫల్య జీవితానికి నిర్దేశిని
శాంతియుత జీవనానికి సోపానం
జీవితాంతం పఠించాలి..
దివ్యఖురాన్ సాధారణ గ్రంథం కాదు. ఇది దైవం మనకు ప్రసాదించిన దివ్యమైన కాంతిపుంజం. దాని పవిత్రతను తెలుసుకొని ఆచరించి ఆరాధిస్తే దైవం ద్వారా మనకు స్వర్గం ప్రాప్తిస్తుంది. ఈ పవిత్ర రంజాన్ మాసంలో పఠించటం ముఖ్యమే అయినా జీవితాంతం క్రమం తప్పకుండా పఠించి, పాటించడం ముక్తిదాయకం. ఖురాన్‌ను నేర్చుకుంటూ, ఇతరులకు నేర్పేవారు ఈ భూమిపై అందరికంటే ఉన్నతులు.
– మౌలానా మొహమ్మద్ అబ్బాస్‌ఖాన్ నద్వి, ఇస్లామిక్ పండితుడు
సన్మార్గ దర్శిని దివ్య ఖురాన్
Comments
Please login to add a commentAdd a comment