చెత్త నుంచి సంపదపై దృష్టి పెట్టాలి
సత్తెనపల్లి: చెత్త నుంచి గ్రామ పంచాయతీలకు ఆదాయం చేకూర్చాలని జిల్లా పంచాయతీ అధికారి ఎంవీ భాస్కర్‌రెడ్డి అన్నారు. స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా గ్రామ పంచాయతీలలో ఘన వ్యర్ధాల నిర్వహణపై జిల్లాలోని అన్ని మండలాల విస్తరణాధికారులకు సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామంలోని ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్‌లో సోమవారం శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటి నుంచి హరిత రాయబారుల ద్వారా ఇంటింటి చెత్త సేకరణ జరగాలన్నారు. తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా సేకరించి చెత్తను సంపద తయారీ కేంద్రానికి చేర్చి వర్మీ కంపోస్ట్ తయారు చేయడం, పొడిచెత్తను వేరుచేసి విక్రయించి గ్రామపంచాయతీలకు ఆదాయం చేకూర్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా ఎటువంటి చెత్త కుప్పలు లేకుండా పారిశుద్ధ్య నిర్వహణ చేయాలన్నారు. అలా చేయని పంచాయతీ కార్యదర్శులు, మండల విస్తరణాధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు, మండల విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ చెత్త సేకరణ చేయించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనే హెచ్చరికలు తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా ఘన వ్యర్థాల నిర్వహణపై జిల్లా రిసోర్స్ పర్సన్‌లు ఆర్.నరసింహ నాయక్, విశ్వరూపాచారిలు శిక్షణ ఇచ్చారు. అనంతరం ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్‌లో సామూహిక భోజనాలు చేశారు. తొలుత జిల్లాలోనే ఆదర్శంగా గుడిపూడిలో ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్డును తీర్చిదిద్దిన గ్రామ పంచాయతీ కార్యదర్శి సిహెచ్ శ్రీనివాసరావును అభినందించారు. నరసరావుపేట డివిజనల్ పంచాయతీ అధికారి వీవీఎం లక్ష్మణరావు, జిల్లాలోని 28 మండలాల మండల విస్తరణ అధికారులు, హరిత రాయబారులు, పాల్గొన్నారు.
గ్రామాల్లో చెత్తకుప్పలు లేకుండా
పారిశుద్ధ్య నిర్వహణ చేయాలి
జిల్లా పంచాయతీ అధికారి
ఎంవీ భాస్కర్‌రెడ్డి
జిల్లాలోని మండల విస్తరణ
అధికారులకు గుడిపూడిలో శిక్షణ
Comments
Please login to add a commentAdd a comment