
ఆకట్టుకున్న కరెన్సీ ఎగ్జిబిషన్
నరసరావుపేట రూరల్: లింగంగుంట్ల శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్‌లో బుధవారం కరెన్సీ ఎగ్జిబిషన్ నిర్వహించారు. కో–ఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ స్వర్ణ చినరామిరెడ్డి ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా వివిద దేశాలకు చెందిన కరెన్సీనోట్లు, నాణేలను ప్రదర్శనలో ఉంచారు. రాజుల కాలం నుంచి బ్రిటిష్ వారి హయాం వరకు, ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి నేటివరకు వినియోగించిన కరెన్సీ, నాణేలను ప్రదర్శించారు. ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఆమెరికా ఖండాలకు చెందిన 78 దేశాల 489 నాణేలు, 76 దేశాలకు చెందిన 188 కరెన్సీ నోట్లు ఇక్కడ ఉంచారు. వివిద పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఎగ్జిబిషన్‌ను తిలకించారు. కరెన్సీ, నాణేల వివరాలను ఆసక్తిగా ఆడిగి తెలుసుకున్నారు. రిటైర్డ్ స్కౌట్ టీచర్ కృష్ణయ్య, లింగాల తిరుపతయ్యలు నాణేలు, కరెన్సీ నోట్లను సేకరించి ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథి స్వర్ణ చినరామిరెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోని ఇన్ని దేశాలకు చెందిన నాణేలు, కరెన్సీ నోట్లను సేకరించడం అభినందనీయమన్నారు. 30 సంవత్సరాలుగా కరెన్సీ సేకరణను కృష్ణయ్య హాబీగా చేసుకోవడం వలన ఇది సాధ్యమయిందని తెలిపారు. పాఠశాల స్కౌట్ మాస్టర్ పమ్మి వెంకటరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయురాలు ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.