
12వ వేతన సంఘం ఏర్పాటు చేయాలి
నరసరావుపేట: రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటుచేసి 30శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని ఏపీ ఫ్యాప్టో నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు బుధవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై నిరసన చేపట్టి కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఫ్యాప్టో చైర్మన్ ఎల్‌వీ రామిరెడ్డి, సెక్రటరీ జనరల్ బి.సంపత్ మాట్లాడుతూ తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. పంచాయతీరాజ్ విభాగంలో కారుణ్యనియామకాలు వెంటనే చేపట్టాలని, కలెక్టర్ పూల్ ద్వారా వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వాలన్నారు. మూడు పెండింగ్ డీఏలను చెల్లించాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ 57వ మెమో ద్వారా పాత పెన్షన్ విధానం అమలుచేయాలన్నారు. 11వ పీఆర్సీ బకాయిలు, డీఏ, సరెండర్ లీవు బకాయిలు, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్, జీపీఎస్‌లను రద్దుచేసి పాత పెన్షన్ విధానం అమలుచేయాలని, 70ఏళ్లు దాటిన పెన్షనర్లకు 10 శాతం, 75ఏళ్లు నిండిన వారికి 15శాతం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అమలుచేయాలని కోరారు. కమిటీ సభ్యులు ఎం.మోహనరావు, ఆర్.గోవిందరాజులు, వి.అశోక్‌కుమార్, మొహిద్దీన్ బేగ్, ఉస్మాన్ పాల్గొన్నారు.
ఏపీ ఫ్యాప్టో నాయకుల డిమాండ్