
అమ్మ.. బాబోయ్!
అమ్మతనం మాయం
యడ్లపాడు: మానవత్వాన్ని కోల్పోయిన కొందరు తల్లులు స్వార్థం, సౌఖ్యం కోసం కుటుంబ సభ్యులు, వారి పిల్లల బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. చివరకు కటకటాలపాలై తమ జీవితాలను చేజేతులా చీకట్లోకి నెట్టేసుకుంటున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జన్మనిచ్చిన తల్లే కర్కశంగా మారి తన బిడ్డను చిత్రహింసలకు గురిచేస్తే, గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో తల్లిస్థానంలో ప్రేమను పంచాల్సిన పినతల్లి బాధ్యతను విస్మరించి అమానుషానికి పాల్పడడం రెండు జిల్లాల్లో కలకలం రేపింది.
కవలలపై పినతల్లి కిరాతకం
యడ్లపాడు మండలం కొండవీడు గ్రామానికి చెందిన రాడ్‌బెండింగ్ పనులు చేసే కంచర్ల సాగర్, కృష్ణాజిల్లా జనగాం ప్రాంతానికి చెందిన అనూష 8 ఏళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. తొలికాన్పులో కార్తీక్(6), ఆకాష్ అనే కవలలు జన్మించారు. రెండో కాన్పు లో పాపకు జన్మనివ్వగానే తల్లి మృత్యువాత పడింది. పాపను యనమదల గ్రామస్తులకు దత్తత ఇచ్చారు. సాగర్ ఫిరంగిపురం ప్రకాశం పంతులు నగర్‌కు చెందిన జి.లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. కొత్త జీవితంలో అడుగుపెట్టిన లక్ష్మి పాపకు జన్మినిచ్చింది. సాగర్ భార్యకు దాసోహం కావడంతో మొదటి భార్య పిల్లల్ని పినతల్లి లక్ష్మి వేధించడం ప్రారంభించింది. గతనెల 29వ తేదీన లక్ష్మి కార్తీక్, ఆకాశ్‌లను బెల్టు, కర్రతో విచక్షణ రహితంగా కొట్టింది. కార్తీక్‌కు తీవ్రంగా గాయమైంది. కసితీరక గొంతునులిమి చంపేసింది. ఇక చిన్నవాడైన ఆకాష్‌ను నిక్కర ఊడదీసి కాల్చిన పెనంపై కూర్చోబెట్టింది. తట్టుకోలేక, ఆ పసిహృదయం బాధతో చేసిన ఆర్తనాదాలు విన్న వీధిలోని వారందరూ పరుగున వచ్చారు. విషయం తెలిసిన సాగర్ చెల్లెలు విజయ ఫిరంగిపురం స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని లక్ష్మి, ఆమె భర్త సాగర్‌ను అదుపులోకి తీసుకోగా, వీరికి కోర్టు రిమాండ్ విధించింది.
తల్లిఒడిలో ప్రేమను ఆస్వాదించాల్సిన పసిబిడ్డలు, తండ్రుల ఆలనలో పెరగాల్సిన చిన్నారులు అమానుషత్వానికి బలవుతున్నారు. కొందరు చిన్నారులు తెలిసీ తెలియని వయసులో అమ్మల కర్కశత్వం చవిచూస్తున్నారు.. ఎవరికీ చెప్పుకోలేక.. ప్రతిరోజూ తల్లి లేదా పిన తల్లి పెట్టే వికృత చర్యలను తట్టుకోలేక.. ఆ చిన్నారులు పడిన వేదన అంతాఇంతా కాదు. ఏడ్చి, ఏడ్చి.. ఏడ్చే ఓపిక సైతం లేక, మూలుగుతూ కర్కశత్వం భరించారా చిన్నారులు. మరొక చిన్నారి తనువు చాలించాడు. వీపుపై దెబ్బల చారలు, తేలిన వాతలు, తమ కంటికింద ఏర్పడిన ఆరని కన్నీటి చారలు కసాయి అమ్మల కర్కశత్వానికి రుజువులుగా మారాయి. అమ్మ తనానికి మచ్చ తెచ్చేలా చేసిన రెండు సంఘటనలు కేవలం రెండు రోజుల వ్యవధిలోనే వెలుగుచూడటం సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
బాలిక వీపుపై తల్లిపెట్టిన వాతలు
మారుతల్లి క్రూరత్వానికి బలైన కొండవీడుకు చెందిన బాలుడు చిలకలూరిపేటలో కన్నబిడ్డను చిత్రవధ చేసిన కన్నతల్లి రెండు రోజుల వ్యవధిలో రెండు అమానుష ఘటనలు రోజురోజుకు తగ్గిపోతున్న కుటుంబ విలువలు
చిలకలూరిపేటకు చెందిన కొణతం మెతూషాల, గోరోజనపు దీప్తిలు ఏడేళ్ల కిందట ఒక్కటయ్యారు. కానీ వారి వివాహబంధం ఎంతో కాలం నిలవలేదు. ఏడాది కిందట విడాకులతో ముగిసింది. పిల్లలు తండ్రి వద్ద ఉంటూనే, అప్పుడప్పుడు తల్లి వద్దకు వెళ్లేవారు. భర్త నుంచి విడిపోయాక మరో వ్యక్తితో సహజీవనం సాగిస్తున్న దీప్తి, తన కన్నబిడ్డకు ప్రేమను పంచాల్సింది పోయి పాశవికంగా ప్రవర్తించింది. గతేడాది డిసెంబర్‌లో అంగన్‌వాడీ కేంద్రంలో ఉన్న పాపను తీసుకెళ్లింది. కొన్నిరోజులుగా తల్లి వేధింపులు భరించలేక బాలిక గతనెల 31వ తేదీ ఇంటి నుంచి పారిపోయే క్రమంలో వీధి మలుపులో స్పృహతప్పి పడిపోయింది. ఇది గమనించిన బాలిక నాయనమ్మ ఏసమ్మ ఆసుపత్రికి తరలించి, అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో తల్లి దీప్తి, ఆమె సహజీవనం చేస్తున్న ప్రియుడు చిన్నారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారని నిర్ధారణ అయ్యింది. వెంటనే పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. పోలీసులే కాకుండా బాలల హక్కుల పరిరక్షణ అధికారులు సైతం స్పందించి చికిత్స నిమిత్తం బాలికను గుంటూరు ఆస్పత్రికి తరలించారు. అనంతరం జిల్లా బాలల సంరక్షణ భవన్‌కు అప్పగించనున్నారు.

అమ్మ.. బాబోయ్!

అమ్మ.. బాబోయ్!