
సహజీవనానికి అడ్డు వస్తుందని చిన్నారికి చిత్రహింసలు
మంగళగిరి: సహజీవనానికి అడ్డు వస్తుదన్న అక్కసుతో తల్లి, పెద్దనాన్న చిన్నారిని చిత్రహింసలు పెట్టి గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారి అమ్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. తాడేపల్లి మండలం గుండిమెడకు చెందిన మరియమ్మకు ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. చిన్నకుమార్తె ప్రీతి అక్క భర్త నాగేంద్రబాబుతో ప్రేమలో పడి సహజీనం చేస్తోంది. దీనిని గమనించిన ప్రీతి భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. ప్రీతికి మూడేళ్ల పాప ఉంది. దీంతో పాపతో సహా ప్రీతి, నాగేంద్రబాబు చినకాకానిలో అపార్ట్‌మెంట్ అద్దెకు తీసుకుని మూడునెలలుగా నివాసం ఉంటున్నారు. తమ బంధానికి అడ్డు వస్తుందన్న అక్కసుతో కొద్ది రోజులుగా నాగేంద్రబాబు పాపను కొట్టి చిత్రహింసలు పెడుతున్నాడు. పాపను అమ్మమ్మతో ఉండాలని ఒత్తిడి చేస్తున్నాడు. మంగళవారం రాత్రి నాగేంద్రబాబు ఇంటికి వచ్చేసరికి పాప ఏడుస్తుండడంతో కోపంతో ఊగిపోయాడు. దారుణంగా కొట్టాడు. ప్రీతి కూడా అడ్డు చెప్పలేదు. సమాచారం తెలుసుకున్న అమ్మమ్మ మరియమ్మ పాపను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించింది. బుధవారం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.