
సుందరయ్య పురస్కారం అందుకోవడం అదృష్టం
యడ్లపాడు: తన జీవితాన్ని సమాజసేవకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య అని కమ్యూనిస్టు నాయకులు పేర్కొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం 22వ జాతీయస్థాయి నాటిక పోటీలు శుక్రవారం రాత్రి ప్రారంభం అయ్యాయి. ముందుగా సుందరయ్య చిత్రపటానికి కమ్యూనిస్టులు, పరిషత్ నిర్వహకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం తొలిరోజు ప్రదర్శనలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా రంగస్థలానికి దశాబ్దాలుగా ఎనలేని సేవలు అందించిన గుంటూరు సంస్కృతి వ్యవస్థాపకులు సఱాజు బాలచందర్‌కు పుచ్చలపల్లి సుందరయ్య పురస్కారం ప్రదానం చేశారు. కళానిలయం ప్రతినిధులు ఆయనకు సత్కార పత్రాన్ని అందించి, ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అజో, విభో కందాళం ఫౌండేషన్ ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ ‘బాలచందర్ జీవిత గ్రంథాన్ని’ ఆవిష్కరించారు. డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబు, అరుణకుమారి దంపతులు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రచయితలు పి.మృత్యుంజయరావు, జరుగుల రామారావు, కమ్యూనిస్టు నాయకులు వై. రాధాకృష్ణ, పీవీ రమణ, పోపూరి సుబ్బారావు, టి. కోటేశ్వరరావు, నూతలపాటి కాళిదాసు, జరుగుల శంకరరావు, టీవీ మల్లికార్జునరావు, ప్రజాగాయకులు తదితరులు పాల్గొన్నారు.
వైవిధ్య అంశాలపై ప్రదర్శనలు
●వైద్యవిద్యలో చేసిన ప్రతిజ్ఞను మరవద్దని తెలియజేసేలా ‘చిగురుమేఘం’ నాటిక ప్రదర్శన కొనసాగింది. అమరావతి ఆర్ట్స్(గుంటూరు) ప్రదర్శించిన ఈ నాటికను కావూరి సత్యనారాయణ రచించగా, ఏపూరి హరిబాబు దర్శకత్వం వహించారు.
●ఉన్నత విద్యకంటే కుటుంబ పెద్దల జ్ఞానం గొప్పదని చెప్పిన ‘కిడ్నాప్’ నాటిక ఆలోచింపజేసింది. తల్లిదండ్రుల ప్రేమ, విలువల్ని, అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా సాగింది. ఉషోదయ కళానికేతన్ (కట్రపాడు) వారి ఈ నాటికకు రచన, దర్శకత్వం చెరుకూరి సాంబశివరావు.
●కుటుంబ వ్యవస్థ నైతిక విలువలకు పునాది అని చెప్పేలా ‘విడాకులు కావాలి’ నాటిక సాగింది. వల్లూరి శివప్రసాద్ రచించిన దీనికి గంగోత్రి సాయి దర్శకత్వం వహించారు. అరవింద ఆర్ట్స్ (తాడేపల్లి) వారు ఈ నాటికను సమర్పించారు.
సంస్కృతి సంస్థ అధినేత సఱాజు బాలచందర్ ప్రారంభమైన సుందరయ్య కళానిలయం నాటిక పోటీలు తొలిరోజు ముచ్చటగా మూడు ప్రదర్శనలు

సుందరయ్య పురస్కారం అందుకోవడం అదృష్టం