ఫ్యాక్టరీలు మూసివేయించారు | - | Sakshi

ఫ్యాక్టరీలు మూసివేయించారు

Apr 6 2025 2:36 AM | Updated on Apr 6 2025 2:36 AM

ఫ్యాక్టరీలు మూసివేయించారు

ఫ్యాక్టరీలు మూసివేయించారు

కప్పం కట్టలేదని

దాచేపల్లి: తనకు కప్పం కట్టలేదనే దురుద్దేశంతో గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెట్టినాడ్‌, భవ్య సిమెంట్‌ ఫ్యాక్టరీలను మూసివేయించాడని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేకి ముడుపులు చెల్లించలేదని ఫ్యాక్టరీలను మూసివేయటం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదని, యరపతినేని చేస్తున్న దుశ్చర్యలతో వేలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తంగెడలోని భవ్య సిమెంట్స్‌ గత రెండు నెలలుగా, పెదగార్లపాడులోని చెట్టినాడ్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ గత 20 రోజులుగా మూతపడటం, ట్రాన్స్‌పోర్ట్‌ పూర్తిగా నిలిచిపోవటంపై శనివారం ఆయన మాట్లాడారు. చెట్టినాడ్‌, భవ్య సిమెంట్‌ ఫ్యాక్టరీలు మూతపడటంపై తాను ఆరా తీశానని, వ్యాపారంలో నష్టాలు రావటం ద్వారా ఫ్యాక్టరీలను మూసివేశారా అనే కోణంలో ప్రభుత్వ అధికారులు, కార్మికులను ఆరాతీస్తే టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకి కప్పం కట్టలేదని ఫ్యాక్టరీలు మూసివేయించారని తనతో చెప్పారని మాజీ ఎమ్మెల్యే కాసు పేర్కొన్నారు.

బస్తాకు రూ.5 నుంచి 20 కప్పం

రెండు ఫ్యాక్టరీలు మూతపడటం వల్ల వేలాదిమంది కార్మికులు కష్టాలు పడుతున్నారని, ఫ్యాక్టరీలను మూసివేయించటం ఎంత వరకు న్యాయమో ఆలోచన చేయాలని ఆయన కోరారు. బస్తాకి రూ.5 నుంచి రూ.20 కప్పం కట్టాలని సిమెంట్‌ కంపెనీలకు అల్టిమేటం ఇవ్వడం చరిత్రలో లేదన్నారు. వర్తమానంలో కూడా ఈ సంస్కృతి రాకూడదన్నారు. ఈ రోజు సిమెంట్‌ ఫ్యాక్టరీలను బెదిరించారని, రేపు సున్నంతో పాటుగా ఇతర వ్యాపారాలు చేసుకునే వ్యాపారులను బెదిరించి కప్పం కట్టమని డిమాండ్‌ చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ విష సంస్కృతిని కూకటి వేళ్లతో తీసేయాలని, దీనికి ప్రభుత్వంలోని సీఎం నుంచి సీఎస్‌, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, మంత్రులు, ఎమ్మెల్యేలు కంకణం కట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే కాసు చెప్పారు. ఫ్యాక్టరీల యజమానులతో తక్షణమే చర్చలు జరిపి యథావిధిగా కార్యకలపాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ సీపీ తరపున తాము డిమాండ్‌ చేస్తున్నామని అన్నారు.

గురజాల టీడీపీఎమ్మెల్యే యరపతినేని దుశ్చర్యతో రోడ్డున పడిన కార్మిక కుటుంబాలు ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని చర్చలు జరపాలి భవ్య, చెట్టినాడ్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీల మూతపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement