
సేవా దృక్పథం అలవరచుకోవాలి
అమరావతి: విశ్రాంత ఉద్యోగులు సేవాదృక్పథం అలవరచుకోవాలని పల్నాడు జిల్లా పెన్షనర్ల సంఘ అధ్యక్షుడు మానం సుబ్బారావు అన్నారు. శనివారం అమరావతి యోగాశ్రమంలో నిర్వహించిన అమరావతి, పెరుకూరపాడు మండలాల యూనిట్ ప్రభుత్వ పెన్షనర్ల సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈసమావేశానికి స్థానిక పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు జి.కోటేశ్వరరావు అధ్య క్షత వహించారు. సుబ్బారావు మాట్లాడుతూ ఉద్యోగంలో ఉన్నంతకాలం సర్వీసు చేయటమే కాకుండా రిటైర్ అయిన తరువాత కూడా సమాజం పట్ల బాధ్యతతో మెలగాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సి.ఆదెయ్య మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే అదనపు క్వాంటుకు పెన్షన్‌ను పెంపుదల చేయాలన్నారు. సైబరు నేరాలు, మోసాలు పెరిగిపోతున్న నేటి రోజుల్లో పెన్షనర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా కోశాధికారి ఎంఎస్‌ఆర్‌కే ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం మూడు డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. వెంటనే పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండు చేశారు. ప్రధానకార్యదర్శి కె.సిహెచ్. తిమ్మయ్య, వై.సుబ్బారావు మాట్లాడారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్.నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా పి.వెంకటేశ్వరరావు, కోశాధికారిగా ఎన్.వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు ఎగ్జిక్యూటివ్ మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.