
వక్ఫ్ బిల్లుపై ముస్లింల మండిపాటు
నరసరావుపేట: కేంద్ర ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా తెచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో భారీ నిరసన ర్యాలీ శాంతియుతంగా నిర్వహించారు. ప్రకాష్‌నగర్‌లోని ఈద్గా మైదానం నుంచి ర్యాలీ ప్రారంభమై ప్లైఓవర్ మీదుగా మల్లమ్మ సెంటర్, గాంధీ చౌక్, గడియారం స్తంభం సెంటర్, మున్సిపల్ కార్యాలయం మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు కొనసాగింది. దారి పొడవునా రాజ్యాంగం, హక్కులు, మతసామరస్యాన్ని కాపాడాలని, అన్ని మతాలను సమానంగా చూడాలని, నల్ల చట్టాలను రద్దు చేయాలని, వక్ఫ్ బిల్లు వెనక్కు తీసుకోవాలని, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ ముస్లింలు నినాదాలు చేశారు. ఈ మేరకు ప్లకార్డులు ప్రదర్శించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్త్ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కె.మధులతకు ముస్లిం జేఏసీ నాయకులు వినతిపత్రం ఇచ్చారు. ర్యాలీలో మౌలానా షాహిద్ రాజా, ముఫ్తీ రైస్ అహమ్మద్, రఫీ మౌలానా, మౌలానా బాసిత్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ మీరావలి, మాజీ కౌన్సిలర్లు షేక్ మస్తాన్‌వలి, అబ్దుల్ గఫార్, సమైక్యా ఆంధ్రప్రదేశ్ ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ జిలాని మాలిక్, ఎంఐఎం మస్తాన్, కరిముల్లా, గోల్డ్ గఫార్, సీపీఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్‌కుమార్, పీడీఎం నాయకులు నల్లపాటి రామారావు, సీఐటీయూ జిల్లా నాయకురాలు డి.శివకుమారి, సిలార్ మసూద్, న్యాయవాదులు షరీఫ్, రజాక్‌తో పాటు నియోజకవర్గంలోని ఆయా మసీదుల పేష్ మామ్‌లు, మౌజన్‌లు, ముఫ్తీలు, మౌలాలు, మత పెద్దలు, ముస్లిం యువత, ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు పాల్గొన్నారు.
ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుతంగా ర్యాలీ సంఘీభావం తెలిపిన సీపీఎం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ప్రజాసంఘాల నాయకులు