నవమాసాలు కడుపులో మోసి ప్రపంచంలోకి తీసుకువచ్చేది తల్లి అయితే..ఈ ప్రపంచాన్ని పరిచయం చేసేది తండ్రి. గురువు, దైవం, మార్గదర్శకుడై, పిల్లల చేయిపట్టి నడిపిస్తూ..భవిష్యత్తు కోసం నిత్యం తపించే తండ్రికి పిల్లలంటే ఎనలేని ప్రేమ. పిల్లల కాలిలో ముల్లు గుచ్చుకుంటే తన గుండెల్లో గునపం దిగినంత బాధ ననుభవించే తండ్రి..విద్యుత్ షాక్ తగిలి కుప్పకూలిపోయిన కూతురి వెంటే తాను కూడా అనంత లోకాలకు పయనమయ్యాడు. డెంకాడ మండలంలోని డి.తాళ్లవలస గ్రామంలో జరిగిన ఈ విషాద సంఘటన వివరాలిలా ఉన్నాయి.
డి.తాళ్లవలస గ్రామానికి చెందిన కట్టా సూర్యారావు(45)కు భార్య శకుంతలతో పాటు కుమార్తె సంధ్యారాణి, కుమారుడు మనోజ్ ఉన్నారు. సూర్యారావు వ్యాపారం చేసి ఆర్థికంగా స్థిరపడ్డాడు. కుమార్తె సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. వర్క్ ఫ్రం హోమ్‌లో భాగంగా ఇంటి నుంచే విధులు నిర్వహిస్తోంది. ఇంటి మేడపై ఆరవేసిన చీరను తీసేందుకు శుక్రవారం రాత్రి కుమార్తె సంధ్యారాణి(22) మేడపైకి వెళ్లింది. ఇంటి ముందుభాగంలో ఉన్న విద్యుత్‌వైరుపై చీర పడింది. చినుకులు పడుతుండడం వల్ల చీర తడిసిపోవడంతో చీర తీస్తున్న సంధ్య విద్యుత్ షాక్‌కు గురై పడిపోయింది.
ఆ సమయంలో బిగ్గరగా అరవడంతో తండ్రి కట్టా సూర్యారావు(45) మేడపైకి వెళ్లి కింద పడి ఉన్న కుమార్తెను లేపేందుకు ప్రయత్నిస్తుండగా ఆయన కూడా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో తండ్రీకూతుళ్లు ఏకకాలంలో మరణించారు. మేడమీదకు వెళ్లిన తండ్రి, సోదరి కిందికి రాకపోవడంతో కుమారుడు మనోజ్ వెళ్లి చూసి వారిద్దరూ విద్యుత్ షాక్‌కు గురయ్యారని గమనించి కాపాడే ప్రయత్నంలో వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. అనంతరం ఇద్దరినీ గ్రామస్తుల సహాయంతో విజయనగరంలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై కృష్ణమూర్తి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment