ఈ సారైనా..?
● నేడు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక
● ఉత్కంఠకు తెరపడేనా..!
● ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రజలు
పాలకొండ నగరపంచాయతీ
కార్యాలయం
పాలకొండ: పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠకు సోమవారం అయినా తెర పడనుందా? లేదా? అని అంతా చర్చించుకుంటున్నారు. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక ఈ సారైనా జరుగుతుందా? అనే ప్రశ్నలు అందరిలో మొదలయ్యాయి. ఈ నెల 3న జరగాల్సిన చైర్మన్ ఎన్నిక 4వ తేదీకి వాయిదా పడగా. 4వ తేదీన కోరం లేక చైర్మన్ ఎన్నిక నిలిచిపోయిన విషయం తెలిసిందే. చైర్మన్ ఎన్నిక నిలిచిపోవడంతో ఈనెల 17న సోమవారం ఈ ఎన్నికల నిర్వహణకు మరోసారి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఈ సారి నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక ఎలా జరగబోతుంది? కుర్చీ ఎవరికి దక్కుతుంది? వైఎస్సార్‌సీపీ పట్టు సాధిస్తుందా? లేక కూటమి దక్కించుకుంటుందా? అని పాలకొండ పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ సారి చైర్మన్ ఎన్నికకు మొదట ఎదురైన పరిస్థితులే వస్తే ఈ సారి ఎన్నికను కూడా వాయిదా వేస్తారా? లేక నిలిపివేస్తారా? లేక ఇంకా ఏం జరగబోతుందనే ప్రశ్నలు పాలకొండ పట్టణ ప్రజల్లో మొదలయ్యాయి. సోమవారం ఉదయం 11 గంటలకు ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఎన్నికను నిర్వహించనున్నారు.
ప్రతిష్టాత్మకంగా చైర్మన్ పదవి
పాలకొండ నగరపంచాయతీ చైర్మన్ పదవిని ఇటు వైఎస్సార్‌సీపీ నాయకులు అటు అధికార బలంతో ఉన్న కూటమి నాయకులు ప్రతిష్టాత్మంగా తీసుకున్నారు.కౌన్సిల్ సభ్యుల సంఖ్యా బలంతో ఉన్న వైఎస్సార్‌సీపీతో పాటు అధికార బలం ఉన్న కూటమి నాయకులు కూడా అంతే ప్రతిష్టాత్మకంగా చైర్మన్ కుర్చీ కోసం పట్టుబడుతున్నారు. అయితే ఈసారి ఎన్నిక వాయిదా పడినా లేదా నిలిచిపోయినా రిజర్వేషన్ ప్రకారం చైర్మన్ పదవి ఎస్సీ మహిళలకు కేటాయించినందున తమతో ఉన్న 2వ వార్డు కౌన్సిలర్ ఆకుల మల్లీశ్వరికి చైర్మన్ పదవి ఖాయమని కూటమి నాయకులు భావిస్తున్నారు. సభ్యుల ఆమోదం లేకుండా ఎన్నిక ఎట్టి పరిస్థితుల్లో జరగదని, ఒకవేళ చైర్మన్ ఎన్నిక జరిగినా సంఖ్యాబలం లేక పాలన సజావుగా జరగదని మరికొందరు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఏం జరగనుందా? అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment