ఆరోగ్యమిత్రల పోరుబాట
● ఆరోగ్యశ్రీని బీమా కంపెనీలకు అప్పగించే యోచనలో ప్రభుత్వం ● ఉద్యోగ భద్రత ఉండదని ఆందోళన చెందుతున్న ఆరోగ్య మిత్రలు ● మార్చి 10, 17, 24 తేదీల్లో విధుల బహిష్కరణకు నిర్ణయం
పార్వతీపురం: ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్) పథకం రోగులకు వైద్య సేవలు అందించడంలో కీలక భూమిక పోషిస్తున్న వైద్యమిత్రలకు భరోసా కరువైంది. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని బీమా కంపెనీకి అప్పగిస్తారన్న ప్రకటన వైద్యమిత్రలను ఆవేదనకు గురిచేస్తోంది. 17 ఏళ్లుగా ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి నేడు ఆధారం కోల్పోతామేమోనన్న భయం వెంటాడుతోంది. వైద్య మిత్రలు, టీం లీడర్లు, జిల్లా మేనేజర్లు, ఆఫీస్ అసోసియేట్‌లు, జిల్లా మానిటరింగ్ యూనిట్ సిబ్బందికి కనీస వేతనం అమలు జరగక ఆందోళన చెందుతున్నారు. కనీసవేతనాలు అమలుచేయాలని వైద్యశాఖ మంత్రికి, ప్రభుత్వ ఉన్నతాధికారులకు విన్నవించినా స్పందన లేకపోవడం నిరాశకు గురిచేసింది. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉంచుతారా.. లేక ప్రైవేటుకు అప్పగిస్తారా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే ఎన్నోఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న సర్వీస్ మొత్తం ఎందుకూ పనికి రాకుండా పోతుందని ఆవేదన చెందుతున్నారు. దీనికి తోడు పాతవారిని కొనసాగిస్తారా లేక కొత్తవారిని తీసుకుంటారా అనే భయాందోళనలో ఉన్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హమీ రాకపోవడంతో రాష్ట్ర నాయకత్వం సూచనలమేరకు వచ్చేనెల 10, 17, 24 తేదీల్లో మూడు రోజులపాటు విధులు బహిష్కరించేందుకు నిర్ణయించినట్టు ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం ఉమ్మడి విజయనగరం జిల్లా అధ్యక్షుడు జెర్రిపోతుల ప్రదీప్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment