పాకలు పీకేశారు..!
● మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన పారిశుధ్య కార్మికులు
● భారీగా పోలీసుల మోహరింపు
బొబ్బిలి: పట్టణంలోని 29వ వార్డు పాకివీధి సమీపంలో 1.40ఎకరాల స్థలాన్ని పారిశుధ్య కార్మికులకు కేటాయించాలని గత పాలకులు ఇచ్చిన హామీ మేరకు అందులో తాత్కాలికంగా వారు వేసుకున్న పాకలను మున్సిపల్ అధికారులు, పోలీసులు రెండు పొక్లెయిన్లతో తొలగించారు. బుధవారం జరిగిన ఈ సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. ఉదయం పారిశుధ్య కార్మికులు ఇళ్ల వద్ద లేని సమయంలో పాకలు తొలగించడానికి వచ్చిన అధికారులు, పోలీసులను మహిళలు అడ్డుకున్నా వెరవకుండా తొలగించారు. ఆ సమయంలో విషయం తెలుసుకున్న కార్మికులు, సంఘం నాయకులు అంతా ఒక చోట చేరి మున్సిపల్ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడంతో కార్యాలయ ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా ఆక్రమించి మోహరించారు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకూ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం ఒంటిగంటన్నర తరువాత కార్మికులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని నినాదాలు చేశారు. పారిశుధ్య కార్మికులకు కేటాయించిన స్థలం కోసం 1991లోనే మున్సిపల్ కార్యాలయానికి రుసుము చెల్లించామని ఆ రశీదులు తమ వద్దే ఉన్నాయని చెప్పారు. ఆ సమయంలో మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి, సీఐలు కె. సతీష్ కుమార్, నారాయణరావు, ఎస్సై ఆర్.రమేష్‌ల సమక్షంలో చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మీకు స్థలాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని, లేకుంటే ఆ పార్టీలోనే ఉండబోనని టీడీపీ నాయకుడు కాకల వెంకటరావు కార్మికులకు చెప్పడం విశేషం. ఈ సందర్భంగా కార్మికులు మెమొరాండం సమర్పించగా మున్సిపల్ ఉన్నతాధికారుల లేఖను కార్మికులకు వారు అప్పగించారు. అక్కడ నిర్మించిన పాకలను వెంటనే తొలగించాలని పోలీసులు, అధికారులు కోరారు. పాకలను తొలగించే వరకూ సరేనని, కానీ అక్కడున్న కర్రలను తొలగించేది లేదని చెప్పడంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. ఆ స్థలంలో కర్రలను తొలగించకపోతే మీపై కేసులు నమోదు చేస్తామని, అరెస్టులుంటాయని హెచ్చరించడంతో కాసేపు తోపులాట జరిగింది. దీంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు సంభవించాయి.
ఆరుగురి అరెస్ట్ కేసుల నమోదు
ఆ సమయంలో కోపోద్రిక్తులైన పోలీసులు ఆరుగురు కార్మిక సంఘం నాయకులు పొట్నూరు శంకరరావు, బంగారి యుగంధర్, ఏడుకొండలు, వడ్డాది శంకర రావు, జి.గౌరీశు, బంగారి వెంకట రమణలను పోలీసు వ్యాన్‌లోకి ఎక్కించి స్టేషన్‌కు తీసుకువెళ్లిపోయారు. అక్కడ వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అక్కడి నుంచి సాయంత్రం వరకూ అక్కడే ఉంచి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువెళ్లి అక్కడ వారిపై బైండోవర్ చేశారు. ఇండ్ల స్థలాలను అడిగితే ఇలా అరెస్టులు, కేసులు ఏమిటని కార్మికులు ప్రశ్నించారు. చర్చల్లో టీడీపీ పట్టణ అధ్యక్షుడు రాంబార్కి శ శరత్, కాకల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
పాకలు పీకేశారు..!
Comments
Please login to add a commentAdd a comment