
మొక్కజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
జొన్నపంట కొనుగోలుకు
ఉత్తర్వులు రావాలి
మొక్కజొన్న గింజలు కొనుగోలు చేయాలన్న మార్గదర్శకాలు ప్రభుత్వం నుంచి ఇంతవరకూ ఇంతవరకూ రాలేదు. జిల్లాలో రైతులు పండించిన మొక్కజొన్నపంట కూడిక పనులు జరుగుతున్నాయి. జొన్నలు కొనుగోలు చేయాలని ఆదేశాలు వచ్చిన వెంటనే కొనుగోలు చేయనున్నాం. – విమల, మార్క్‌ఫెడ్ మేనేజర్
● రైతుల డిమాండ్
సీతానగరం: రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో పారదర్శకంగా అండగా ఉంటామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం, దళారులను ప్రోత్సహించడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. సీతానగరం మండలంలో నీటివనరులుండి ఖరీఫ్ వరి పంట కోసిన మాగాణీ భూములు వందలాది ఎకరాల విస్తీర్ణంలో రైతులు మొక్కజొన్న సాగుచేశారు. ఈ ప్రాంతంలో రైతులు వాణిజ్యపంటగా మొక్కజొన్నను ఎంపిక చేసుకున్నారు. చక్కెర కర్మాగారం మూతపడడంతో చెరకు సాగు చేయాల్సిన భూముల్లో మొక్కజొన్న, పామాయిల్ తోటలను సాగు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మొక్క జొన్న పంట కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, లేదా గత ప్రభుత్వం మక్కువలో ఏర్పాటు చేసిన జొన్నపంట కొనుగోలు కేంద్రాన్ని పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీ అమలు చేయడం లేదని వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతో దళారులు ఇదే అదునుగా వారికి నచ్చిన ధరకు పంట ఇవ్వాలని లేదంటే మీ ఇష్టమని అనడంతో పండించిన పంట ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నా మని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జొన్నపంటంతా పొలాల్లో నూర్పిడిచేసి తేమ నివారించడానికి ఆరబెట్టే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు.