ఆంద్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి ఏమీ తోచడం లేదు.పెద్దగా పని ఉండడం లేదు. అప్పుడప్పుడూ గుడులనో, గోపురాలనో హడావుడి చేస్తేనన్నా పార్టీ ఉనికి నిలబడుతుందని అనుకున్నారేమో తెలియదు కానీ, తాజాగా ఒక కారికేచర్ ఆధారంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపైన విమర్శలు కురిపించి నిరసనలకు దిగారు. ఒకప్పుడు మానవ సేవే మాధవ సేవ అనేవారు. కాని ఏపీలో బీజేపీ ఆ నానుడిని మార్చివేసినట్లుగా ఉంది. పసిపిల్లవాడికి శివరాత్రి నాడు ముఖ్యమంత్రి జగన్ పాలుపడుతున్నట్లుగా ఒక కారికేచర్ వచ్చింది. దానిని వైసీపీ అధికారిక ట్విటర్ లో పోస్టు చేశారట. అందులో ఏదో పెద్ద తప్పు ఉన్నట్లు బీజేపీ నేతలు కనిపెట్టేశారు.
కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా వారు నిరసనలు, ధర్నాలు అంటూ రంగంలోకి దిగారు. ఇక ప్రకటనల ఊదర ఎటూ ఉంటుంది. దానిపై వైసీపీ ఎమ్మెల్యేలు , మంత్రులు సీరియస్ గా స్పందించారు. నిజానికి బీజేపీ వారి చేష్టలపై అసలు స్పందించకపోయినా పెద్దగా పోయేదేమీ లేదు. కాని మతపరమైన అంశంగా బీజేపీ చిత్రీకరిస్తున్న నేపధ్యంలో ఈ వ్యవహారం సున్నితంగా ఉంటుంది కనుక వైసీపీ నేతలు దానిపై మాట్లాడినట్లు ఉన్నారు. ఆ కారికేచర్ గమనించినవారికి ఎవరికైనా ముందుగా వచ్చే ప్రశ్న అందులో ఏమి తప్పు ఉందని! ఇందులో హిందువుల మనోభావాలు ఎలా దెబ్బతింటాయని! బీజేపీ అద్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ ఇన్ చార్జీ సునీల్ ధియోదర్, రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు తదితర ముఖ్యనేతలతో పాటు చిన్నా,చితక నేతలు కూడా దీనిపై ప్రచారం చేపట్టారు.
ఈ ప్రభుత్వం ఏకంగా హిందూ వ్యతిరేక ప్రభుత్వమని వారు తేల్చేశారు. అదెలాగంటే పసిపిల్లవాడికి పాలు పట్టడమట. ఇంతకన్నా విడ్డూరం ఏమైనా ఉంటుందా? చిన్నారి బాలుడికి పాలు పడితే శివుడికి క్షీరాభిషేకం చేయడాన్ని అపహాస్యం చేసినట్లయిందని వారు ఆరోపిస్తున్నారు. హిందువులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. ఏదో ఈనాడు, తదితర టీడీపీ మీడియా ప్రచార సంస్థల ద్వారా ప్రచారం పొందడానికి తప్ప బీజేపీ నేతల చర్య ఎందుకన్నా ఉపయోగం ఉంటుందా?ఈనాడు కూడా అసలు ఆ ఫోటోలో ఏముందో రాయకుండా శివలింగానికి క్షీరాభిషేకాన్ని అవహేళన చేసేలా ఫోటో ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారని మాత్రమే పేర్కొనడం గమనించదగిన అంశం.
ఆ ఫోటోను సవివరంగా ప్రచురిస్తే అసలు విషయం బయటపడిపోయి,ప్రజలకు వాస్తవం తెలిసిపోతుందన్నది ఈనాడు భయం కావచ్చు. సరే!వారి బాద వారిది! ఎక్కడ ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా మహా ప్రసాదంగా ఈనాడు భావిస్తోంది . అది వేరే సంగతి.సోము వీర్రాజు ఆద్వర్యంలో ఏకంగా మార్కాపురం, గిద్దలూరులలో ధర్నాలు కూడా చేసేశారు. ఆయనేదో అక్కడకు టూర్ కు వెళ్లినట్లున్నారు. ఏదో ఒకటి చేస్తే పోలా అని చేసినట్లుంది తప్ప ఏ మాత్రం ఇందులో అర్దం లేదు.ఏపీలో మతపరమైన వైరుధ్యాలు క్రియేట్ చేయడానికి గతంలోను బీజేపీతో పాటు జనసేన, టీడీపీలు ప్రయత్నాలు చేయకపోలేదు. గుడులలో చోరీలు జరిగాయనో, విగ్రహాలను పాడు చేశారనో , ఏవో సాకులతో అలజడి సృష్టించడానికి కృషి చేశారు. కాని అవేవి ఫలించలేదు.
ప్రభుత్వం అలాంటి చిన్న ఘటన జరిగినా వెంటనే సీరియస్‌గా రియాక్ట్ అవడమే కారణమని వేరే చెప్పనవసరం లేదు. ఉదాహరణకు అంతర్వేదిలో రధం దగ్దం అయిన ఘటనపై విపక్షం నానా రాద్దాంతం చేసింది. వెంటనే సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాని కేంద్రం దానిపై స్పందించలేదు.శ్రీకాకుళం జిల్లాలో ఒక విగ్రహాన్ని తరలించిన ఘటనను వివాదాస్పదం చేశారు. తీరా చూస్తే టీడీపీవారే కావాలని అలా చేసి యాగీ చేశారని సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా వెల్లడైంది. రామతీర్దంలో రాముడి విగ్రహాన్ని ద్వంసం చేశారంటూ మరో గొడవను సృష్టించారు. ప్రభుత్వం వెంటనే మరో కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించింది.
ఈ రకంగా హిందువుల మనోభావాలకు ఎక్కడా దెబ్బ తగలకుండా చర్యలు చేపడుతుంటే విపక్షానికి ఏమి చేయాలో పాలుపోవడం లేదు. అంతేకాదు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యంత నిష్టతో ప్రతి హిందూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సంక్రాంతి ,ఉగాది .. ఇలా ఒకటేమిటి? ఆలయాలలో ఉత్సవాలు పలు సందర్భాలలో ఆయనే పూజా కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అయినా బీజేపీ నేతలకు ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా కనిపిస్తోంది. కొంతకాలం క్రితం వరకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి పిచ్చి ప్రచారం ద్వారా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని యత్నించి భంగపడ్డారు. ఆయా కేసులలో టీడీపీవారే నిందితులుగా పట్టుబడుతుండడంతో ఆయన సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత అలాంటి ఘటనలే దాదాపు జరగకుండా ఆగిపోయాయి. ఏమి దొరకక బీజేపీవారికి ఈ చిన్న పిల్లాడి బొమ్మను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూడడం దారుణం.
అదే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ , మాజీ మంత్రులు కొడాలి నాని, కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు ప్రస్తావించారు. హిందూ మతం బీజేపీ సొంతం కాదని వారు స్పష్టం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో 40 గుళ్లను కూల్చివేస్తే బీజేపీ నేతలు అప్పట్లో నోరు మెదపని విషయాన్ని వారు గుర్తు చేసి ప్రశ్నించారు.
వీటికి వారి వద్ద సమాధానం ఉండదు. బీజేపీవారు ఇంతటి శ్రద్దను పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో, ప్రత్యేక హోదా అంశంలో ,రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం విషయంలో చూపించి ఉంటే మంచి పేరు వచ్చేది. బీజేపీకి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ గుడ్ బై చెప్పడం, జనసేన తమతో పొత్తులో ఉంటుందో, ఉండదో తెలియని వైనం తదితర కారణాలతో రాజకీయాలను డైవర్ట్ చేయడానికి బీజేపీ పూనుకున్నట్లు కనిపిస్తుంది. అందుకే ఏదో ఒక సాకుతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకుని బీజేపీ ఈ విమర్శలు చేసినట్లుగా ఉంది. కానీ అవి హేతుబద్దంగా లేకపోవడం, అర్ధవంతంగా లేకపోవడం వల్ల బీజేపీనే నవ్వులపాలవుతోంది. అందువల్ల ఇలా చిన్నపిల్లాడికి పాలు పడితే కూడా తప్పుపట్టే విధంగా బీజేపీ నేతలు మాట్లాడకుండా ఉంటేనే వారికి పరువు దక్కుతుంది.
-హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్.
Comments
Please login to add a commentAdd a comment