
జగిత్యాల: ‘మహిళలపై అత్యాచారం జరిగితే ఎందుకు నోరు విప్పడం లేదు? అసెంబ్లీలో మహిళలకు 33 శాతం సీట్లు ఏవీ? మీ ప్రభుత్వంలో మహిళలు ఎందరున్నారు? మీ పారీ్టలో ఎంతమంది మహిళలకు చోటిచ్చారు? మహిళా గవర్నర్‌ను ఎందుకు అవమానిస్తున్నారు? వీటిపై ముందు మీ నాన్నను నిలదీయండి.. జంతర్‌మంతర్ వద్ద నువ్వు ధర్నా చేస్తానంటే మహిళలు నవ్వుకుంటున్నారు..’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. శుక్రవారం జగిత్యాలలో మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ భోగ శ్రావణితో ఆయన భేటీ అయ్యారు. ఆమె నివాసంలో కాసేపు వివిధ అంశాలపై చర్చించిన తర్వాత విలేకరులతో మాట్లాడారు.
ఎంఐఎం పరాన్నజీవుల పార్టీ
మహిళా బిల్లు విషయంలో కవిత ఢిల్లీలో ధర్నా చేస్తామనడం విడ్డూరంగా ఉందని సంజయ్ వ్యాఖ్యానించారు. మహిళా బిల్లును ప్రవేశపెడితే పార్లమెంటులో ఆ కాపీలను చింపిపడేసిన పారీ్టలతో ఎందుకు దోస్తానా చేస్తున్నావని నిలదీశారు. మెడికో ప్రీతి నాయక్ ఆత్మహత్య చేసుకున్నా, నిర్మల్‌లో బాలికపై అధికార పార్టీ నేతే అత్యాచారానికి పాల్పడినా ముఖ్యమంత్రి కనీసం స్పందించ లేదని విమర్శించారు.
గంటకో లైంగిక వేధింపు, పూటకో అత్యాచారం జరుగుతుంటే ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలపై అత్యాచారాలు చేసేవారి, హత్యలకు పాల్పడేవారి అంతు చూస్తామని హెచ్చరించారు. బీజేపీ అంతు చూస్తామని మజ్లిస్ నేత ఒవైసీ చెప్పడం హాస్యాస్పదమని సంజయ్ పేర్కొన్నారు. ఎంఐఎం పరాన్నజీవుల పార్టీ అని, సీఎం విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడే పార్టీ అని ధ్వజమెత్తారు. దమ్ముంటే 119 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment