‘తిరుపతి’పై బీజేపీ, జనసేన చర్చలు | BJP And Janasena Parties Met In Hyderabad On Tirupati Lok Sabha by-election | Sakshi
Sakshi News home page

‘తిరుపతి’పై బీజేపీ, జనసేన చర్చలు

Published Wed, Dec 9 2020 5:17 AM | Last Updated on Wed, Dec 9 2020 5:17 AM

BJP And Janasena Parties Met In Hyderabad On Tirupati Lok Sabha by-election - Sakshi

సాక్షి, అమరావతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీపై చర్చించేందుకు మిత్రపక్ష పార్టీలైన బీజేపీ, జనసేన మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యాయి. బీజేపీ తరఫున పార్టీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సతీష్జీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ దియోధర్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి మధుకర్‌జీలు పాల్గొనగా.. జనసేన నుంచి పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌లు హాజరయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. తిరుపతిలో ఎవరు పోటీ చేయాలనే దానిపై సమావేశంలో ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే బీజేపీ, జనసేన కలసి పోటీ చేసే విషయాన్ని మాత్రం బాగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చించి, వారి సూచనలకు అనుగుణంగా ఎవరు పోటీ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుందామని పవన్‌కల్యాణ్‌ అన్నట్లు సమాచారం.  
 
కేంద్ర బృందంతో విచారణ జరిపించాలి 
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు అంతుచిక్కని వ్యాధితో అనారోగ్యానికి గురికావడంపై ప్రత్యేక కేంద్ర బృందంతో అధ్యయనం, విచారణ చేయించాల్సిందిగా ప్రధాని మోదీని కోరాలని సమావేశంలో నిర్ణయించినట్టు జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. నివర్‌ తుపాను మూలంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని కనబరుస్తోందని బీజేపీ, జనసేనలు అభిప్రాయపడినట్టు ఆ ప్రకటన పేర్కొంది. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయడం లేదని, ఫలితంగా ఉపాధి అవకాశాలు క్షీణించాయని సమావేశం అభిప్రాయపడినట్టు వివరించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement