సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఫస్ట్ లిస్ట్‌లో 195 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. శనివారం సాయంత్రం ఢిల్లీలోని పార్టీ కార్యాలయం నుంచి అభ్యర్థుల లిస్ట్‌ను పేర్లవారీగా చదివి వినిపించారు బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావడే. 370 సీట్లలో గెలవడమే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతోందని ఈ సందర్భంగా తెలిపారాయన.
ఈ జాబితాలో.. 34 మంది సిట్టింగ్ కేంద్ర మంత్రులకు తిరిగి టికెట్లు దక్కాయి. అత్యధికంగా ఉత్తర ప్రదేశ్ నుంచి 51 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. బెంగాల్ 20, మధ్యప్రదేశ్ 24, గుజరాత్ 15, రాజస్థాన్ 15, కేరళ 12 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. తొలి జాబితాలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, 28 మంది మహిళా అభ్యర్థులకు చోటు దక్కింది. సామాజిక వర్గాల వారీగా 27 మంది ఎస్సీ, 18 మంది ఎస్టీ, 57 మంది ఓబీసీ కేటగిరీకి చెందిన వారికి సీటు కేటాయించారు. తొలి జాబితాలో 50 ఏళ్ల లోపు వయస్కులైన 47 మంది చోటు దక్కించుకున్నారు.
అగ్రనేతల సీట్లు..
వారణాసి నుంచే నరేంద్ర మోదీ, గాంధీనగర్(గుజరాత్) నుంచి అమిత్ షా, యూపీలోని లక్నో నుంచి రాజ్‌నాథ్ సింగ్, అమేథీ(యూపీ) నుంచి స్మృతి ఇరానీ పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో స్మృతి ఇరానీ రాహుల్ గాంధీని అమేథీలో ఓడించిన సంగతి తెలిసిందే. విదిష నుంచి మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహార్ బరిలో నిలవనున్నారు. అర్జున్‌రామ్ మేఘ్వాల్ బికనూర్ నుంచి, గజేంద్రసింగ్ షెకావత్ జోధ్‌పూర్ నుంచి పోటీ చేయబోతున్నారు.
కాగా నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి మనోజ్ తివారీ, వెస్ట్ ఢిల్లీ నుంచి కమల్‌జీత్ షెరావత్, సౌత్ ఢిల్లీ నుంచి రాంవీర్ సింగ్ బింధూరి, ఢిల్లీ చాంద్నీ చౌక్ నుంచి ప్రవీణ్ ఖందేల్‌వాల్ పేర్లను బీజేపీ ఖరారు చేసింది.
రాజ్యసభ టూ..
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్షుక్ మాండవీయ(ప్రస్తుతం రాజ్యసభ ప్రాతినిధ్యం).. పోరుబందర్(గుజరాత్) నుంచి లోక్‌సభ బరిలో నిలవడం విశేషం. అలాగే.. తిరువనంతపురం నుంచి రాజీవ్ చంద్రశేఖర్(ప్రస్తుతం రాజ్యసభ) సీటు ఖరారు చేశారు. ఈ స్థానంలో కాంగ్రెస్ తరఫున శశిథరూర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కిరణ్ రిజిజు అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ స్థానం నుంచి, మధ్యప్రదేశ్‌లోని గుణ సీటును జ్యోతిరాదిత్య సింధియాకు, ఆల్వార్ లోక్‌సభ స్థానాన్ని భూపేందర్ యాదవ్‌కు ఖరారు చేశారు.
ఆశ్చర్యకరరీతిలో.. ఖేరీ స్థానాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేనికే కేటాయించారు. తేని తనయుడు అశిష్ మిశ్రా 2021 లఖింపూర్ ఖేరీలో రైతు డిమాండ్ల సాధన కోసం జరిగిన ఆందోళన కార్యక్రమంలో రైతులపైకి వాహనంతో దూసుకెళ్లిన ఘటన చర్చనీయాంశంగా మారడమే కాదు.. తీవ్ర నిరసనలకు దారి తీసింది కూడా. ఈ కేసులో అశిష్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.
మొదటి జాబితాలో మరో హైలెట్ ఏంటంటే.. భోపాల్ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్(సాధ్వీ ప్రజ్ఞా)కు టికెట్ ఇవ్వలేదు. ఆమె స్థానంలో అశోక్ శర్మకు అవకాశం ఇచ్చారు.
మిగతా వాళ్లలో.. హేమామాలినికి మథుర నుంచే(2014 నుంచి ఆమె ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు). కేరళ త్రిసూర్ నుంచి సినీ నటుడు సురేష్ గోపికి సీటు కేటాయించారు. అసోం మాజీ ముఖ్యమంత్రి శర్వానంద్ సోనోవాల్‌కు దిబ్రూఘర్ నుంచి ఛాన్స్ ఇచ్చారు.
ఇక.. ‘చిన్నమ్మ’, సుష్మా స్వరాజ్ తనయ బన్సూరి స్వరాజ్‌కు న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అవకాశం ఇచ్చారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి.
2019లో..
గత ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం.. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత 11 రోజులకు 180కి పైగా స్థానాలతో తొలి జాబితా ప్రకటించింది. కానీ, ఈసారి మాత్రం ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడక ముందే(మార్చి 14/15/16 తేదీల్లో ప్రకటించవచ్చనే అంచనా) ఏకంగా 195 స్థానాలతో అభ్యర్థుల్ని ప్రకటించింది. ముందుగా ప్రకటించడం మూలంగా.. అభ్యర్థుల ప్రచారానికి టైం దొరుకుతుందని.. తద్వారా 370 టార్గెట్ రీచ్ అయ్యేందు అవకాశం ఉంటుందని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment