
ఏయూ క్యాంపస్ (విశాఖతూర్పు): ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని కేంద్ర ప్రభుత్వం సత్వరమే నెరవేర్చాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు విశాఖ రైల్వే జోన్ ఇస్తామని హామీ ఇచ్చారని అది ఎక్కడ ఉందో చెప్పాలని ప్రశ్నించారు. రాజకీయ విభేదాలున్నప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అన్ని పార్టీలు కలసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం విశాఖపట్నంలోని ఏయూ స్నాతకోత్సవ మందిరంలో ‘ఈ నెల 27న దేశ బంధ్‌ను జయప్రదం చేయాలి..విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించుకుందాం’ అనే నినాదంతో సీపీఎం గ్రేటర్ విశాఖ నగర కమిటీ నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొన్నారు. బృందాకారత్ మాట్లాడుతూ.. కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేస్తూ.. బడా వ్యాపారవేత్తలకు కేంద్ర ప్రభుత్వం బానిసలా వ్యవహరిస్తున్నదని, దేశ సంపదను అదాని, అంబానీలకు దోచి పెడుతుందని ఆరోపించారు.
రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తూ బీజేపీ ప్రభుత్వం తన పరిపాలన సాగిస్తోందన్నారు. రైతులపై బీజేపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు నినదిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో తొమ్మిది నెలలుగా రైతులు అలుపెరగని పోరాటాలు చేస్తున్నా పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. మోదీ పాలనలో వలస కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. కరోనా మహమ్మారి విలయానికి ఆక్సిజన్ అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. దీన్ని కప్పిపుచ్చుతూ ఉచిత వ్యాక్సిన్ హోర్డింగ్‌లను పెట్టుకుంటూ మోదీ పబ్బం గడుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను వదిలేసి మత సమస్యలపై పోరాడటం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. కరోనాతో త్రిపుర సీపీఎం రాష్ట్ర కార్యదర్శి గౌతమ్‌దాస్ మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు. సీపీఎం గ్రేటర్ నగర కార్యదర్శి బి.గంగారావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ నరసింగరావు, సీపీఐ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శి సత్యనారాయణ మూర్తి, సీపీఎంఎల్ న్యూడెమోక్రసీ నేత కొండయ్య ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment