సీఎం చంద్రబాబు శ్వేతపత్రం కాదది.. సాకు పత్రం
మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపాటు
సాక్షి, సిటీ బ్యూరో: చంద్రబాబు ఎన్నికల ముందు అట్టహాసంగా ప్రకటించిన సూపర్ సిక్స్.. అమలు ఆరంభానికి ముందే, తొలి ఓవర్‌లోనే డకౌట్ అయిందని ఏపీ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విడుదల చేసింది శ్వేతపత్రం కాదని, అది ఒక సాకు పత్రమని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా కుంటి సాకులతో అన్నీ అసత్యాలు వల్లించారని, ప్రజలను తప్పుదారి పట్టించాలని తప్పుడు లెక్కలు చూపించారని ధ్వజమెత్తారు. శనివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
చంద్రబాబు అసలు శ్వేతపత్రానికే అర్థం మార్చాడని, రాష్ట్రాభివృద్ధి కోసం తామేం చేయబోతున్నామో చెప్పకుండా.. కేవలం గత ప్రభుత్వంపై నిందలు, అన్నింటికీ బాధ్యులను చేయడం విడ్డూరంగా ఉందన్నారు. శ్వేతపత్రాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. రాజకీయాల్లో 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్లు సీఎంగా పని చేశానని పదే పదే వల్లించే చంద్రబాబు.. సంపద సృష్టించడం తనకు మాత్రమే తెలుసని గొప్పగా ప్రచారం చేసుకొని, ఇప్పుడు తమ సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలను అడుగుతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
బాబు వైఖరి చూస్తుంటే.. ‘మీరంతా కొండను ఎత్తి, నా నెత్తిపై పెట్టండి. నేను దాన్ని మోస్తాను’ అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. చివరకు గవర్నర్‌తో కూడా అబద్ధం చెప్పించారని విమర్శించారు. రాష్ట్ర పరిపాలన కోసం రూ.2 లక్షల 50 వేల కోట్లు అవసరం ఉంటే ఆదాయం రూ.2 లక్షల 40 వేల కోట్లని.. రెగ్యులర్ జీతభత్యాలు, పెన్షన్లు, సబ్సిడీలు, పీడీఎస్, అప్పులకు వడ్డీలు ఏటా రూ.10 వేల కోట్లు అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందని, ఏం చేయాలని ప్రజలను ప్రశి్నస్తే ఏలా అని నిలదీశారు. అలాంటప్పుడు ఏటా దాదాపు లక్షన్నర కోట్ల వ్యయమయ్యే పథకాలను ఎలా ప్రకటించారని దుయ్యబట్టారు.
వాటిని అమలు చేయడం సాధ్యం కాదని తెలిసి.. శ్వేతపత్రాల పేరుతో సాకు పత్రాలు విడుదల చేస్తున్నారని ధ్వజమెత్తారు. తల్లికి వందనం కింద ప్రతి పిల్లాడికి రూ.15 వేలు, 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500, ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, రైతులకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయం.. వీటన్నింటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. బుగ్గన ఇంకా ఏం చెప్పారంటే..
సంపద సృష్టి ఒట్టి మాటే
⇒ చంద్రబాబు సంపద సృష్టి అంతా ఒట్టి మాటే. 2014–15లో రాష్ట్ర ఆదాయం రూ.90,672 కోట్లు. 2019లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి అది రూ.1,14,671 కోట్లు. ఆదాయం ఏటా 6.09 శాతం పెరిగింది. 2019–20లో రాష్ట్ర ఆదాయం రూ.1,11,034 కోట్లు కాగా, 2023–24 నాటికి అది రూ.1,76,448 కోట్లకు చేరింది. రాష్ట్ర ఆదాయం ఏటా 16.7 శాతం పెరిగింది. మేము అధికారంలోకి వచ్చాక 2019 జూలైలోనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాం. ఇప్పుడు మీరెందుకు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టలేదు? అలా చేస్తే మీ బండారం బయట పడుతుందనే కదా!
⇒ నిజానికి రాష్ట్ర నికర అప్పు రూ.4,38,278 కోట్లు మాత్రమే. పబ్లిక్ అకౌంట్స్ లయబిలిటీ కింద మరో రూ.80,914 కోట్ల రుణాలున్నాయి. ఇతరత్రా అన్నీ కలుపుకున్నా కూడా మొత్తం అప్పులు రూ.7 లక్షల కోట్లు మాత్రమే. మా ప్రభుత్వ హయాంలో ప్రాధాన్య రంగాలకు ఎక్కువ ఖర్చు చేశాం. టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగంపై కేవలం రూ.13,255 కోట్లు ఖర్చు చేస్తే, మేము ఏకంగా రూ.47,800 కోట్లు ఇచ్చాం. మేము తీసుకొచి్చన ‘గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్’ (జీపీఎస్)ను ఇప్పుడు దేశమంతా అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది.
వైఎస్సార్‌సీపీ చేస్తే అప్పు.. టీడీపీ చేస్తే నిప్పా?
⇒ టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ 50 రోజుల్లోనే అపరిమితంగా అప్పు చేసింది. గత జూన్ 20న రూ.2 వేల కోట్లు, జూలై 2న రూ.5 వేల కోట్లు, జూలై 16న మరో రూ.2 వేల కోట్లు అప్పు చేశారు. 2014–19 మధ్య రాష్ట్ర అప్పులు 21 శాతం పెరిగితే, మా హయాంలో 2019–24 మధ్య ఆ పెరుగుదల 12 శాతం మాత్రమే. ఇది ఎల్లో మీడియాకు కనిపించడం లేదా? వైఎస్సార్‌సీపీ చేస్తే అప్పు.. టీడీపీ చేస్తే నిప్పా?
⇒ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అప్పులు 2014లో రూ.1,18,051 కోట్లు ఉంటే, 2019 నాటికి అవి రూ.2,71,795 కోట్లకు చేరుకున్నాయి. అంటే టీడీపీ హయాంలో 21.63 శాతం పెరిగాయి. మా ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.5.18 లక్షల కోట్లు. అంటే 12.9 శాతం పెరుగుదల మాత్రమే. అయినా ఎల్లో మీడియా దారుణంగా వ్యవహరిస్తోంది. రాజకీయ పారీ్టలకు అనుబంధంగా ఉన్న ప్రజాశక్తి, విశాలాంధ్ర లాంటి పత్రికలు ఎన్నడూ ఇలా వన్ సైడ్ తప్పుడు కథనాలు ప్రచురించలేదు. ఆ రెండు (ఈనాడు, ఆంధ్రజ్యోతి) పత్రికలు మాత్రం ఏకపక్షంగా తప్పుడు రాతలు రాస్తున్నాయి.
‘‘పేదల పథకాలకు సంబంధించి ఇచి్చన హామీలన్నీ అమలు చేయడం కష్టమని మేము తొలి ఏడాది ఓ సమావేశం (అంతర్గత)లో చెబితే..‘ఇది నేను ఇచి్చన మాట. మేనిఫెస్టోలో పెట్టాం. ఇది పేద వారికి సంబంధించిన వాగ్దానం. మాట తప్పేందుకు కుదరదు. ఒకవేళ తప్పాల్సి వస్తే నేనే దిగిపోతాను’ అన్నారు. మేమంతా షాక్ అయ్యాం. ఆ తర్వాత కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం మేము, మా అధికారులందరం కోవిడ్‌ను సైతం లెక్కచేయకుండా తిరిగాం. అలా మా నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కమిట్‌మెంట్‌తో హామీలు అమలు చేశారు’’ అని బుగ్గన వివరించారు.
అన్నీ తప్పుడు లెక్కలు
⇒ టీడీపీ హయాంలో 2014–19 మ«ధ్య స్థూల ఉత్పత్తి బ్రహా్మండంగా పెంచామని చంద్రబాబు శ్వేతపత్రంలో చెప్పుకోవడం సరికాదు. కోవిడ్ పీరియడ్.. కోవిడ్ లేని కాలంతో పోలికా? టీడీపీ పాలన కంటే, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే స్థూల ఉత్పత్తిలో వృద్ధి సాధించాం. 2014 నుంచి 2019 వరకు దేశ స్థూల ఉత్పత్తిలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నిష్పత్తి 4.47 కాగా, అదే 2019 నుంచి 2024 వరకు 4.82గా నమోదైంది. పారిశ్రామిక రంగానికి సంబ«ంధించి దేశ జీడీపీలో రాష్ట్ర జీడీపీ వాటా 2014– 2019 మధ్య 2.98 శాతం కాగా, 2019–2024 మధ్య 4 శాతం. అయినా పరిశ్రమలు రాలేదని అసత్య ప్రచారం చేయడం విడ్డూరం.
⇒ వైఎస్ జగన్ పాలనలో స్థూల ఉత్పత్తితో పాటు తలసరి ఆదాయం కూడా మెరుగు పడింది. టీడీపీ పాలన చివరి ఏడాది 2018–19లో తలసరి ఆదాయం రూ.1,54,031 కాగా, ఆ పెరుగుదల 11.38 శాతం. వైఎస్సార్‌సీపీ పాలనలో చివరి ఏడాది 2023–24లో తలసరి ఆదాయం రూ.2,19,518 కాగా, అది 13.98 శాతానికి పెరిగింది. దీంతో మన రాష్ట్రం 18వ స్థానం నుంచి 13వ స్థానానికి చేరింది. సులభతర వాణిజ్యం (ఈఓడీబీ)లో రాష్టం నంబర్ వన్‌గా నిలిచింది. మా పాలనలో మద్యం అమ్మకాలు తగ్గినా, ప్రభుత్వ ఆదాయం పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment