జగ్గారెడ్డితో మాట్లాడుతున్న రాజగోపాల్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి వెళ్లొద్దని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కోరారు. కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లాలనుకుంటున్నానని ప్రకటించి సంచలనం సృష్టించిన జగ్గారెడ్డితో గురువారం భట్టి సమావేశమయ్యారు. సీఎల్పీ కార్యాలయ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం... సీఎల్పీ కార్యాలయానికి రావాలని జగ్గారెడ్డికి భట్టి ఫోన్ చేసి ఆహ్వానించారు. శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా ఉంటారని, కూర్చుని మాట్లాడుకుందామని చెప్పడంతో జగ్గారెడ్డి గురువారం మధ్యాహ్నం సీఎల్పీ కార్యాలయానికి వచ్చారు.
అప్పటికే అక్కడ ఉన్న భట్టి, శ్రీధర్‌బాబులతో సమావేశమయ్యారు. కొద్దిసేపటి తర్వాత ఈ భేటీకి రాజగోపాల్‌రెడ్డి కూడా హాజరయ్యారు. పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలపై నలుగురు నేతలు మాట్లాడుకోవడంతోపాటు వ్యక్తిగతంగా తమ అభిప్రాయాలను కూడా పంచుకున్నారు. జగ్గారెడ్డి స్పందిస్తూ పార్టీ లో కొన్ని ఇబ్బందులున్నాయని చెప్పుకొచ్చారు. ఇబ్బందులతోపాటు తన ఆవేదనను కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకాగాంధీలతో చెప్పుకుంటానని, వారి అపాయింట్‌మెంట్ లభించే వరకు ఆగుతానని స్పష్టం చేశారు.
అయితే, వీరి అపాయింట్‌మెంట్ బాధ్యతను సీఎల్పీ నేతగా భట్టి తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు సూచించగా కచ్చితంగా పార్టీ అధిష్టానంతో మాట్లాడి అపాయింట్‌మెంట్ ఖరారు చేయిస్తానని భట్టి హామీ ఇచ్చారు. ఒకవేళ కాంగ్రెస్‌ను వీడితే వేరే పార్టీలోకి వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా అని ముగ్గురు ఎమ్మెల్యేలు జగ్గారెడ్డిని ప్రశ్నించగా అలాంటిదేమీలేదని ఆయన స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడి వెళితే మాత్రం కొత్త పార్టీ పెట్టుకుంటానని వారికి చెప్పారు.
నేడు కార్యకర్తలతో భేటీ కానున్న జగ్గారెడ్డి
జగ్గారెడ్డి శుక్రవారం సంగారెడ్డి నియోజకవర్గంలోని కార్యకర్తలతో భేటీ కానున్నారు. సంగారెడ్డిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కార్యకర్తలు, నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వచ్చే నెలలో నిర్వహించిన బహిరంగ సభ తేదీ, స్థలాన్ని ఖరారు చేయనున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment