Congress Leader Digvijaya Singh Responds To BJP Attack On Article 370 Revocation Comment - Sakshi
Sakshi News home page

ఆర్టికల్‌ 370 రచ్చ.. దిగ్విజయ్‌పై విమర్శల వర్షం

Published Sat, Jun 12 2021 5:27 PM | Last Updated on Sat, Jun 12 2021 7:58 PM

Digvijaya Singh Responds To BJP Attack On Article 370 Revocation Comment - Sakshi

న్యూఢిల్లీ: ఒకవేళ తాము అధికారంలోకి వస్తే.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ను రద్దుపై పునరాలోచన చేస్తామంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. దిగ్విజయ్‌ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఓ పాక్‌ జర్నలిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిగ్విజయ్‌ ఒకవేళ కేంద్రంలో మేం అధికారంలోకి వస్తే..  జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడంపై తమ పార్టీ పునరాలోచన చేస్తుందన్నారు.

దిగ్విజయ్‌ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నాయకులు ట్విట్టర్‌ వేదికగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ మనస్తత్వం ఏంటో దిగ్విజయ్‌ వ్యాఖ్యలతో పూర్తిగా వెల్లడయ్యింది. కశ్మీర్‌ లోయలో కాంగ్రెస్‌ వేర్పాటువాద బీజాలు నాటుతోంది.. పాక్‌ డిజైన్లను అమలు చేస్తోంది అంటూ బీజేపీ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ట్వీట్‌ చేశారు. దాంతో పాటు బీజేపీ సోషల్‌ మీడియా చీఫ్‌ అమిత్‌ మాల్వియా చేసిన వీడియోని పోస్ట్‌ చేశారు. 

ఈ వీడియోలో దిగ్విజయ్‌ ‘‘వారు(బీజేపీ) ఆర్టికల్‌ 370ని రద్దు చేసినప్పుడు అక్కడ ప్రజాస్వామ్యం లేదు. అందరిని జైల్లో పెట్టారు. సెక్యూలరిజం అన్న దానికి కశ్మీరియత్‌ అనేది మూలం. ఎందుకంటే ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో హిందూ రాజు పాలన చేశాడు. ఇద్దరు కలసికట్టుగా పని చేశారు. కశ్మీర్‌ పండిట్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాం. జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదాను కోల్పోవడం చాలా విచారకరమైన నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని పునః పరిశీలించాలనుకుంటుంది" అన్నారు దిగ్విజయ్‌.

దిగ్విజయ్‌ ఇంటర్వ్యూ అనంతరం సోషల్‌ మీడియాలో ఆర్టికల్‌ 370 ట్రెండ్‌ కావడంతో పలువురు బీజేపీ నాయకులు మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌పై విమర్శల వర్షం కురిపించారు. ఈ క్రమంలో బీజేపీ నాయకుడు సంబిత్‌ పాత్ర ‘‘దిగ్విజయ్‌ని ఇలాంటి ప్రశ్న అడిగిన పాక్‌ విలేకరికి ధన్యవాదాలు. కాంగ్రెస్‌ పార్టీ పేరు మార్చాలని నేను కోరుకుంటున్నాను. భారత జాతీయ కాంగ్రెస్‌(ఐఎన్‌సీ) బదులు యాంటీ నేషనల్‌ క్లబ్‌ హౌస్‌ అని మార్చితే బాగుటుంది. దీనిలోని వారంతా మోదీని, భారతదేశాన్ని ద్వేషిస్తున్నారు’’ అని విమర్శించారు. 

తనపై వస్తోన్న విమర్శలపై దిగ్విజయ్‌ స్పందించారు. ‘‘లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల సానుభూతిపరులు, బీజేపీ, మోదీ-షా పాలనను వ్యతిరేకిస్తున్న వారందరూ ఈ వినాశకరమైన పాలనను (సిక్) తొలగించడానికి ఓటు అనే ఆయుధంతో పోరాడతారు" అని ట్విట్‌ చేశారు. 

"బహుశా, నిరక్షరాస్యులకు 'తప్పక', పరిగణించాలి' మధ్య వ్యత్యాసం అర్థం కాలేదు," అని దిగ్విజయ్‌ హిందీలో మరొక ట్వీట్‌లో పేర్కొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement