జమిలి ఎన్నికల బిల్లుపై చర్చించే అవకాశం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. కీలకమైన జమిలి ఎన్నికల బిల్లుపై ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’పై ముసాయిదా బిల్లును కేంద్ర న్యాయ శాఖ రూపొందిస్తున్నట్లు సమాచారం. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ బిల్లుపై చర్చించి, ఆమోదించబోతున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
మంత్రివర్గం ఆమోదించిన తర్వాత బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్ట నున్నారు. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’కు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి జమిలి ఎన్నికల చట్టం రావాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది.
మరోవైపు జమిలి ఎన్నికలకు 32 రాజకీయ పార్టీలు అంగీకారం తెలియజేశాయి. మరో 13 పార్టీలు వ్యతిరేకించాయి. జమిలి ఎన్నికల బిల్లును ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టి, ఆమోదింపజేసు కోవాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. 2027లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని మోదీ సర్కారు నిర్ణయించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment