
న్యూఢిల్లీ: రెండు విడతల్లో జరగనున్న మణిపూ ర్ అసెంబ్లీ (మొత్తం 60 స్థానాలు) పోలింగ్‌లో ఎన్నికల సంఘం (ఈసీ) స్వల్ప మార్పులు చేసింది. తొలుత విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 27, మార్చి 3వ తేదీల్లో పోలింగ్ జరగాలి. అయితే ఫిబ్రవరి 27న ఆదివారం వస్తోందని, ప్రార్థనల కోసం చర్చికి వెళ్లడానికి వీలుగా ఆ రోజు పోలింగ్‌ను వాయిదా వేయాలని కొన్ని క్రైస్తవ సంస్థలు కోరడంతో ఎన్నికల తేదీలను మార్చాల్సి వచ్చిందని ఈసీలోని విశ్వసనీయవర్గాల సమాచారం.
ఫిబ్రవరి 28, మార్చి 5వ తేదీల్లో మణిపూర్ పోలింగ్ ఉంటుందని ఈసీ గురువారం ప్రకటించింది. ‘క్షేత్రస్థాయిలో పరిస్థితులు, ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉండటం, కొన్ని విజ్ఞప్తులు అందడం, గత దృష్ట్యాంతాలు.. ఇలా అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని పోలింగ్ తేదీలను మారుస్తూ నిర్ణయం తీసుకున్నామని ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది.