సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకాంక్షల మేరకు రాష్ట్రంలో అధికార సాధన దిశగా బీజేపీ దూసుకుపోతుందని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గతంలోని ఒక సీటుతో పోలిస్తే 8 సీట్లలో గెలవడంతోపాటు రెండింతల ఓట్ల శాతాన్ని సాధించిందని తెలిపారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, నేతలు డా. ఎస్.ప్రకాశ్‌రెడ్డి, టి. ఆచారి, మురళీయాదవ్, నరహరి వేణుగోపాల్‌రెడ్డిలతో కలసి ఈటల మీడియాతో మాట్లాడుతూ ఇతర పార్టీలు డబ్బు సంచులు పంచినా ప్రజలు తమకు ఇంత గొప్ప విజయాన్ని కట్టబెట్టారని చెప్పారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ 36 లక్షల ఓట్లు (15 శాతం ఓట్లు) సాధించేలా చేశారన్నారు. అందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఈటల పేర్కొన్నారు. ప్రజలు, కార్యకర్తలు అందించిన విశ్వాసం, నమ్మకంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 2019లో గెలిచిన సీట్ల కంటే రాష్ట్రంలో అధిక స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని చెప్పారు. అలాగే దేశవ్యాప్తంగా బీజేపీ 400 సీట్లలో గెలిచి సత్తా చాటుతుందని ఈటల విశ్వాసం వ్యక్తంచేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం గురించి తనకేమీ తెలియదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. దీనిపై పార్టీ నాయకత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
కడియం వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: రఘునందన్
బీఆర్‌ఎస్ 39 సీట్లతోపాటు బీజేపీకి 8, ఎంఐఎంకు 7 సీట్లు కలిస్తే తమ బలం పెరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ స్టేషన్ ఘనపూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో టీడీపీలోని ఆయన పాత మిత్రుడైన కడియం శ్రీహరి కలవదలుచుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. ప్రజలిచ్చిన తీర్పుతో రాష్ట్రంలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించనుందని, ఎంఐఎంతో అంటకాగే పార్టీలతో బీజేపీ ఎలాంటి సంబంధాలు పెట్టుకోదని ఆయన స్పష్టంచేశారు. బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని, ఈ ఎన్నికల్లో ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకొని ముందుకు సాగుతామన్నారు.
సోషల్ మీడియాలో పోస్టులొద్దు...
బీజేపీ నేతలపై సోషల్ మీడియాలో పెడుతున్న అభ్యంతరకర పోస్టులను పార్టీ నాయకత్వం గమనిస్తోందని రఘునందన్‌రావు ఒక ప్రశ్నకు బదులిచ్చారు. వాటిపై సరైన సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తగిన నిర్ణయం తీసుకుంటారన్నారు. అప్పటివరకు అందరూ సంయమనం పాటించాలని, ఓటమి బాధతో సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. కార్యకర్తలు నిరుత్సాహానికి గురికావొద్దని, మళ్లీ పూర్తిస్థాయి శక్తితో పుంజుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment