ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విజయవాడలో వరద మరణాలు
∙మీడియాతో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్
సాక్షి, విశాఖపట్నం: విజయవాడ వరదల్లో మరణించిన వారివి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. నగరాన్ని వరద ముంచెత్తబోతోందని ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం ఉన్నా.. ప్రజలను అప్రమత్తం చేయలేదని, కనీసం ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టలేదని మండిపడ్డారు. వరద బాధితులను ఆదుకోవడంలోనూ ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. సోమవారం విశాఖలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడ వరదలు ప్రకృతి వైపరీత్యం కాదని, అది ప్రభుత్వం సృష్టించిన వైపరీత్యమని ఆరోపించారు.
సీఎం చంద్రబాబుకున్న పబ్లిసిటీ యావతో నలుగురు ఫొటో గ్రాఫర్‌లను జేసీబీపై ఎక్కించుకుని ప్రచారం చేయించుకుంటున్నారని, ఆయనకు ప్రజల మరణాలతో పనిలేదని, పబ్లిసిటీ ఉంటే చాలు అని మండిపడ్డారు. బుడమేరు వరదపై నీటి పారుదల శాఖ డీఈ, జిల్లా కలెక్టర్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా.. భిన్న ప్రకటనలు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతున్నాయన్నారు.
ప్రజల దృష్టి మళ్లించడానికే డైవర్షన్ పాలిటిక్స్..
గతంలో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో శబరి, గోదావరి నదులకు భారీ వరదలు వచ్చినప్పుడు సుమారు 250 ఏజెన్సీ గ్రామాలకు చెందిన 18 వేల కుటుంబాలను 102 పునరావాస కేంద్రాలకు తరలించామని మాజీ మంత్రి గుర్తుచేశారు. కనీస రహదారి లేని చోట్ల లాంచీలు ఏర్పాటు చేసి, అక్కడి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, ఒక్క ప్రాణనష్టం కూడా జరక్కుండా చూశామన్నారు. అలాంటిది విజయవాడ నడిబొడ్డున వరదలు వస్తే, కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మరణాలు సంభవించడం అత్యంత బాధాకరమన్నారు. దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని దుయ్యబట్టారు. ఆ దిశలోనే ప్రతి అంశాన్ని తమ పార్టీకి అన్వయిస్తున్నారని ఆక్షేపించారు.
Comments
Please login to add a commentAdd a comment