రాజకీయాలకు.. నినాదాలకు అవినాభావ సంబంధం ఉంది. సందర్భాన్నిబట్టి రాజకీయ నేతలు చేసే నినాదాల్లో కొన్ని హిట్ కొట్టవచ్చు.. కొన్ని ఫట్ కూడా కావచ్చు. కానీ.. ఒక్కోసారి ఒక్క నినాదంతోనే క్లిష్టమైన ఎన్నికల గండం గట్టెక్కనూ వచ్చు. 1971లో ఇందిరాగాంధీ ఇచ్చిన ‘గరీబీ హఠావో’ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. దేశం మొత్తం పెను సంచలనం సృష్టించిందీ నినాదం. కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం తెచ్చిపెట్టింది కూడా. 1999లో బీజేపీ నేత, అప్పటి ప్రధాని ఏబీ వాజ్‌పేయి ‘ఇస్ బార్.. అటల్ బిహారీ వాజ్‌పేయి’ అన్న నినాదమూ బాగానే పనిచేసింది. ఒకే ఒక్క ఓటుతో వాజ్‌పేయి ప్రభుత్వం కూలిపోవడంతో ప్రజల్లో ఏర్పడ్డ సానుభూతి, కార్గిల్ యుద్ధం వంటివి కూడా అప్పట్లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగపడ్డాయి. కానీ.. 2004లో ‘ఇండియా షైనింగ్’ నినాదంతో ఎన్నికలకు వెళ్లిన బీజేపీకి అంత సానుకూల ఫలితాలు దక్కలేదన్నది తెలిసిన విషయమే.
ఉమ్మడి ఆంధప్రదేశ్ విషయానికి వస్తే.. 1983లో ఎన్నికలకు ముందు ఎన్టీ రామారావు ఇచ్చిన ‘తెలుగు ఆత్మగౌరవం’ నినాదం బాగా పనిచేసింది. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చింది. 2019లో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ ఇచ్చిన 'ఒక్క చాన్స్" పిలుపు కూడా బాగా పనిచేసింది. చంద్రబాబు పాలనతో అప్పటికే విసుగెత్తిన ప్రజలు జగన్‌కు సై అన్నారు. నినాదాల శక్తి గురించి ఇంకా పలు ఉదాహరణలు ఇవ్వొచ్చు. తాజాగా జగన్ ఇంకో కొత్త కాన్సెప్ట్‌ను ప్రజల్లోకి తీసుకొచ్చారు. అది.. ‘గుడ్‌బుక్’!
ప్రస్తుతం ఆంధప్రదేశ్ ప్రజలను ప్రజలను తీవ్రంగా భయపెడుతున్న తెలుగుదేశం ప్రభుత్వ ‘రెడ్ బుక్’కు ఇది ప్రత్యామ్నాయమన్నమాట. సహజంగానే ఇది జనాన్ని ఆకట్టుకుంటుంది.తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు, మాజీ మంత్రి లోకేశ్‌కు ఎవరు ఐడియా ఇచ్చారో కానీ.. ప్రతిపక్షంలో ఉండగా.. రెడ్‌బుక్ అంటూ ఒక పుస్తకాన్ని చేతపట్టుకుని ప్రభుత్వ అధికారులను ,ప్రత్యేకించి పోలీసులను బెదిరించేవారు. వైసీపీ నేతలకూ హెచ్చరికలు చేసేవారు. తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న, వ్యాఖ్యానిస్తున్న అధికారులు, నేతల పేర్లు ఈ ‘రెడ్ బుక్’లో రాసుకుంటున్నానని, అధికారంలోకి వచ్చాక వారందరి సంగతీ చూస్తామని బెదిరించేవారు.
స్కామ్‌లలో చికుక్కున్న టీడీపీ అగ్రనేతల కేసులు విచారణకు వచ్చిన సందర్భంలోనూ లోకేశ్ రెడ్‌బుక్ పేరుతో బెదిరించడంతో అధికారులు కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ఆ కేసు ఏమైందో తెలియదు. వీరిని మినహాయిస్తే మిగిలిన వాళ్లు ఈ రెడ్‌బుక్‌ను పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. లోకేశ్.. ఏదో అనుభవరాహిత్యంతో చేస్తున్న పనే అని సర్దుకున్నారు. పైగా టీడీపీ అధికారంలోకి వస్తుందని కూడా ఎవరూ ఊహించలేదు.
అయితే 2024లో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది. ఈవీఎంల మహిమే ఇది అన్నది చాలామంది నమ్మకం. అది వేరే సంగతి. అధికారం వచ్చాక టీడీపీ వారు రెడ్ బుక్‌ను అమలు చేయాలని నిర్ణయించుకుని చెలరేగిపోవడం మొదలైంది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల కంటే ఈ రెడ్ బుక్‌పైనే వాళ్లు ఎక్కువ దృష్టి పెట్టినట్లు స్పష్టమైంది. లోకేష్ రెడ్ బుక్ అంటూ రాష్ట్రంలో ఆయా చోట్ల హోర్డింగ్ లు కూడా వెలిశాయి. ప్రభుత్వం పిచ్చోడి చేతిలో రాయిగా మారింది. అలాగే బాధ్యతలివ్వకుండా సుమారు పాతిక మంది ఐపీఎస్, ఐఎఎస్ అధికారులను వేధిస్తున్నారు.
పలు నియోజకవర్గాలలో తమకూ రెడ్ బుక్ లు ఉన్నాయంటూ టీడీపీ ఎమ్మెల్యేలు స్థానిక అధికారులను, తమకు ఓటు వేయని ప్రజలను భయ పెట్టడమూ మొదలైంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తన బుక్ లో వంద మంది పేర్లు ఉన్నాయని ప్రకటించడమే ఇందుకు ఉదాహరణ. పల్నాడు, తదితర అనేక ప్రాంతాలలో టీడీపీ వారి దౌర్జన్యాలకు అంతు లేకుండా పోయింది. అలాగే వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారు. టీడీపీ వారు పోలీసుల సమక్షంలో దౌర్జన్యాలకు పాల్పడుతున్నా, ఇళ్లను ధ్వంసం చేస్తున్నా వారించే నాథుడు లేకుండా పోయాడు. ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం మహిమేనని జనానికి అర్థమైంది.
జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా గత ప్రభుత్వం పార్టీలకు అతీతంగా వివిధ స్కీములు అమలు చేసింది. కానీ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం వరద సహాయ చర్యల్లోనూ బాధితులు తమ మద్దతుదారులా? వైసీపీ మద్దతుదారులా? అన్నది ఆరా తీసి మరీ తమ వారైతేనే సాయం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో వైసీపీ కార్యకర్తలలో ఆత్మ విశ్వాసం నింపేందుకు, ప్రజలకు అండగా ఉండేందుకు , అలాగే ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నవారికి ఒక ధైర్యాన్ని ఇచ్చేందుకు జగన్ వ్యూహాత్మకంగా గుడ్ బుక్ కాన్సెప్ట్ తీసుకువచ్చారు.
రెడ్ బుక్ వర్సెస్ గుడ్ బుక్ అన్న పోటీ వస్తే సహజంగానే ఎవరైనా గుడ్ బుక్‌నే కోరుకుంటారు. రెడ్ బుక్‌లోని కక్షలు, కార్పణ్యాలు, పగ, ప్రతీకారం, అకృత్యాలు వంటివాటిని సాధారణంగా ఎవరూ ఇష్టపడరు. ఇప్పటికే సూపర్ సిక్స్ అమలు చేయలేక, రెడ్ బుక్ పేరుతో అరాచకాలకు పాల్పడుతున్న టీడీపీ కూటమి అంటే ప్రజలలో వ్యతిరేకత ఏర్పడింది. వారు తమకు గత్యంతరం ఏమిటా అని ఆలోచిస్తున్న తరుణంలో గుడ్ బుక్ తెస్తామని జగన్ ప్రకటించడంతో ప్రజలలో ఆశలు చిగురించే అవకాశం ఉంది. దీంతో టీడీపీ ప్రభుత్వం అరాచకాలు కాస్త తగ్గే అవకాశం ఉండవచ్చు. పార్టీ సమావేశంలో ప్రసంగిస్తూ జగన్ రెడ్ బుక్ అన్నది పెద్ద విషయం కాదని, దానివల్ల కక్షలే తప్ప ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.తన ప్రభుత్వంలో ప్రతి ఇంటికి మంచి చేయడానికి ప్రయత్నిస్తే, టీడీపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా రెడ్ బుక్ పాలన సాగిస్తోందని విమర్శించారు. ఇది నిజమే అని ఒప్పుకోవాలి.
జగన్ ప్రభుత్వం తీసుకు వచ్చిన అనేక స్కీములతో రాష్ట్రంలోని 87 శాతం మంది ప్రజలు ప్రయోజనం పొందారు. అమ్మ ఒడి, ఆసరా, కాపు నేస్తం, చేనేత నేస్తం, ఫీజ్ రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ.. ఇలా సుమారు 35 స్కీములను ఆయన వలంటీర్ల ద్వారా ప్రజల ఇళ్ల వద్దకే పంపించారు.అర్హత ఉండి ఎవరికైనా ఏదైనా స్కీమ్ అందకపోతే,మానవత్వంతో అందచేయాలని జగన్ ఆదేశాలు ఇచ్చేవారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అవన్నీ ఆగిపోయాయి. ఇళ్ల వద్దకు సేవలు నిలిచిపోయాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు చేసిన వాగ్దానాలన్ని గాలికి పోయాయి. ప్రతిదానికి ఏదో సాకు వెదుకుతున్నారు.
డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నారు. వీటన్నిటిని గుర్తు చేస్తూ జగన్ తాను గుడ్ బుక్ తీసుకు వస్తానని అన్నారు. ఈ పుస్తకంలో మంచిచేసే అధికారుల పేర్లు రాస్తామని, అలాగే పార్టీ కోసం పని చేసేవారి పేర్లు నమోదు చేసుకుంటామని ఆయన చెప్పారు. అంటే టీడీపీ, చంద్రబాబు, లోకేష్‌లది నెగిటివ్ ఆలోచనైతే, వైసీపీ జగన్‌లది పాజిటివ్ ధోరణి అన్నమాట. రెడ్ బుక్ వల్ల టీడీపీకి టీడీపీ ఇప్పటికే అప్రతిష్ట పాలైంది. జగన్ గుడ్ బుక్ గురించి ప్రకటించగానే సమావేశంలో ఉన్నవారంతా హర్షద్వానాలు చేశారు.అంటే వైసీపీ వారినే కాకుండా, ప్రజలందరికి ఈ గుడ్ బుక్ ఉపయోగపడుతుందని వారు భావించారన్నమాట. దీనిపై జనంలో సానుకూల స్పందన వస్తోంది. గుడ్ బుక్ కాన్సెప్ట్‌ను నిలబెట్టుకుంటూ జగన్ ప్రజలలోకి వెళితే రాజకీయంగా కూడా ఉపయోగం ఉండవచ్చు.
- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment