ఇకనుంచి ప్రజలు ఒక విషయం అర్ధం చేసుకోవాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ- 5 వంటి తెలుగుదేశం మీడియాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్న కార్యక్రమాల గురించి ఎంత ఎక్కువ వ్యతిరేక వార్తలు రాశాయంటే ఆ ప్రోగ్రాం అంత విజయవంతం అయిందని గుర్తించాలి. అనంతపురం జిల్లా నార్పల వద్ద జగనన్న వసతి దీవెన కింద విద్యార్దుల తల్లుల ఖాతాలో సుమారు వెయ్యి కోట్ల రూపాయల మేర జమ చేయడానికి ఒక ఫంక్షన్ జరిగింది. జగన్ ముఖ్య అతిథిగా పాల్గొని బటన్ నొక్కి ప్రజల ఖాతాలలోకి ఆ డబ్బు జమ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు విశేష సంఖ్యలో వేలాది మంది తరలి వచ్చారు. వారిలో అన్ని వయసుల వారూ ఉన్నారు. సభా ప్రాంగణం పట్టలేదు.
జగన్ మాట్లాడిన ప్రతి మాటకు జనం చప్పట్లతో హోరెత్తించారు. జగన్ ను ఉద్దేశించి కొద్ది మంది విద్యార్ధులు చక్కగా మాట్లాడారు.ప్రోగ్రాం పూర్తి అయ్యాక అనుకోకుండా హెలికాఫ్టర్‌కు సాంకేతిక సమస్య రావడంతో జగన్ రోడ్డు మార్గంలో పుట్టపర్తి విమానాశ్రయానికి వెళ్లారు. ఈ క్రమంలో రోడ్లపై కూడా జనం పెద్ద ఎత్తున గుమికూడి ఆయనకు అభివాదాలు చేశారు. నిజానికి ఇటీవలికాలంలో ఒక ముఖ్యమంత్రికి ఈ స్థాయిలో స్పందన రావడం జగన్ విషయంలోనే జరుగుతోంది. ఒకప్పుడు ఎన్టీఆర్ రాజకీయంతో పాటు,సినీ గ్లామర్ తోడవడంతో ప్రజలు బాగా తరలివచ్చేవారు. ఆ తర్వాత వైఎస్ఆర్‌కు కొంతమేర జనం వచ్చినా, జగన్‌కు వచ్చిన స్థాయిలో కాదని చెప్పకతప్పదు.
ఆయన ఎక్కడకు వెళ్లినా జనం రావడమే కాకుండా ఆ కార్యక్రమంలో లీనమై ఉంటున్నారు. జగన్ కూడా వారిని ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేస్తున్నారు. నార్పలలో జరిగిన సభ సూపర్ హిట్ అయింది. ఆ సభలో ఆయన పంచతంత్రం కథను ప్రస్తావించి ముసలి పులి బాటసారులను ఎలా మోసం చేసేదో వివరించి , దానిని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు వర్తింపచేశారు. ఈ కథ విన్నంత సేపు జనం ఒకటే నవ్వులు. ఒకటే స్పందన. ఒకటే చప్పట్లు. దీనిని గమనించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి ,టీవీ 5 మీడియాలకు కడుపు మండిపోయింది. అక్కసు పెరిగిపోయింది.
దాంతో దీనిని ఎలా పక్కదారి పట్టించాలా అన్న ఆలోచన చేశారు. అంతలో జగన్ రోడ్డు మార్గంలో వెళుతున్నారన్న సమాచారంతో దానిని ఒక అవకాశంగా వాడుకోవాలని యోచించారు. వెంటనే తెలుగుదేశం వారికి చెప్పి నాగేపల్లి అనేచోట ఒక పది మందిని పోగుచేసి తమకు పరిహారం రావడంలో జాప్యం అంటూ హడావిడి చేయించారు. తీరా చూస్తే ఆ పరిహారం ఇవ్వవలసింది తెలుగుదేశం హయాంలోనిది. 2018లో సేకరించిన భూములకు సంబందించిందట. ఏదో కారణం వల్ల జాప్యం అయిందేమో తెలియదు. కాని దానిని జగన్‌కు ముడిపెట్టి ఆ పది మందితో నిరసన డ్రామా ఆడించారు.
అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నారు కనుక ఫోటోలు, తదితర కవరేజీ ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు అనిపిస్తుంది.ఇక వారి టివీలలో, మరుసటి రోజు పత్రికలలో దానినే పతాక శీర్షికలలో కథనాలు వండి వార్చారు. అసలు ఇక జగన్‌కు వివిధ వర్గాల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయని రాష్ట్ర ప్రజలందరిని మోసం చేయాలని వీరు కుట్ర పన్నారు. బ్రహ్మాండంగా జరిగిన సభను, పాల్గొన్న వేలాది మంది ప్రజలనేమో బాగా తక్కువచేసి చూపించారు. పట్టుమని పది మంది కూడా లేని సో కాల్డ్ ఆర్గనైజ్ డ్ నిరసనకేమో విపరీత ప్రచారం కల్పించారు.
టీడీపీ కోసం బట్టలు ఊడదీసుకునే మరో పత్రిక అయితే పరదాలు లేకుంటే ఇంతేనా అంటూ కొత్త భాష్యం చెప్పి తన కుళ్లును బయటపెట్టేసుకుంది. ఆ పత్రిక బట్టలు లేకుండా తిరుగుతుంటే తాము ఎక్కడ వెనుకపడి పోతామో అని భావిస్తున్న ఈనాడు మరీ అసహ్యంగా తయారై ఎలాంటి కథనాలు ఇచ్చిందో చూడండి.. సి.ఎమ్. సభ అంటే పరుగో, పరుగో అని అంటున్నారట.. బారికేడ్ల బందనాలు దాటి బయటకు వెళుతున్నారట. అంటూ రాష్ట్రవ్యాప్తంగా అదే పరిస్థితి అని పిక్చర్ ఇవ్వడానికి తెగ తాపత్రయపడింది. తద్వారా పత్రిక విలువల వలువలు వలిచి రామోజీరావు తన పత్రికను ఎలా అధ్వాన్నంగా నడుపుతున్నది ఇట్టే తెలిసిపోతుంది.
టీడీపీ అధినేత చంద్రబాబు సభలకు జనం వచ్చినా, రాకపోయినా పటం కట్టి అబ్బో .. అంటూ మొదటి పేజీలో వేస్తున్నారు. సి.ఎమ్ జగన్ కు మాత్రం నిరసనలు అంటూ చెత్తా, చెదారం ఫోటోలు వేసి ఆత్మవంచన చేసుకుంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడువచ్చిన జనం ఎందుకు వచ్చామురా బాబూ అన్నట్లుగా ఉసూరుమంటూ కూర్చునేవారు. కాని జగన్ సభలలో ఉత్సాహంగా పాల్గొంటున్న విషయం స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. చంద్రబాబు ఇటీవల బందరు, గుడివాడ వంటి చోట్ల సభలు పెట్టినప్పుడు వేసిన కుర్చీలలో మూడువంతులు పైగా ఖాళీగా కనిపించాయి. పొద్దుపోయాక సభ జరపడం వల్ల కావచ్చు.
లేదా బోరు కొట్టి కావచ్చు.. వాటిని మాత్రం కనబడనీయకుండా వార్తలు ఇస్తున్న ఈ మీడియాలు జగన్ కు సంబంధించి ఆవ గింజంత ఏదైనా జరిగితే దానిని కొండంత చూపి ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.దీని అంతటికి కొన్ని కారణాలు ఉన్నాయి. తాము ఎంత వ్యతిరేక వార్తలు ఇస్తున్నా జనం ఈ రకంగా జగన్ ను ఆదరించడం ఏమిటా అన్నది వారికి అర్ధం కావడం లేదు. ఎలాగైనా జనంలో ఆయనను పలచన చేయాలన్నది వారి లక్ష్యం. ఆ క్రమంలో వారే పరువు పోగొట్టుకుంటున్నారు. అది వేరే సంగతి . కొద్ది రోజుల క్రితం టైమ్స్ నౌ సర్వేలో వైసిపికి 24 లేదా 25 లోక్ సభ స్థానాలు వస్తాయని వెల్లడవడం ఇంకొ కారణం. దాంతో ఈ టీడీపీ మీడియాకు వెర్రి గంగుర్లు పుడుతున్నాయి తాము ఎంత కల్పిత వార్తలను సృష్టిస్తున్నా సర్వే లో ప్రజల మనోగతం ఇలా ఉండడంతో వారికి ఎటూ పాలుపోవడం లేదు.
దాంతో మరింత విజృంభించి దారుణమైన రీతిలో అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. మరో వైపు మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలపై మాజీ ఎమ్.పి ఉండవల్లి అరుణకుమార్ ఉతికి ఆరవేస్తున్నారు. దానిని కప్పిపుచ్చడానికి కూడా రామోజీ చేయని ప్రయత్నం లేదు. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి షర్మిల చేసిన వ్యాఖ్యలకు విశేష ప్రాధాన్యత ఇచ్చిన ఈనాడు మరి మార్గదర్శి మోసాల గురించి ఎందుకు రాసుకోలేకపోతోంది?ఏది ఏమైనా వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ఈనాడు, ఆంధ్రజ్యోతి,టివి 5 మీడియా సంస్థలు ఇలాగే కుట్రలు చేస్తూ రెచ్చిపోతుంటాయి. దుష్టచతుష్టయం అన్న పేరును అవి సార్ధకం చేసుకుంటాయి. అయినా ప్రజలు ఇప్పటికే వీరి కుట్రలు,కుతంత్రాలు గమనించారు. వీరి కుట్రలతోనే టీడీపీ గెలుస్తుందా? భ్రమ కాకపోతే!
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment