సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శనివారం సమావేశమయ్యారు. రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన ఈ భేటీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నేతలు పాల్గొన్నారు. నిరుద్యోగులపై పెట్టిన కేసులు, పార్టీ ఫిరాయింపుల అంశం, ప్రోటోకాల్ ఉల్లంఘన, రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
గవర్నర్‌తో భేటీ అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రాజ్యాంగంపై జరుగుతున్న దాడిని గవర్నర్‌కు వివరించినట్లు తెలిపారు. నిరుద్యోగ యువత, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఇప్పుడు తుంగలో తొక్కారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులపై కేసులు, దాడులు జరుగుతున్నాయని.. హైదరాబాద్‌లో ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. మొదటి సంవత్సరంలో రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ ఊసే లేదని అన్నారు. గతంలో భర్తీ చేసిన 30,000 ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించినవని తెలిపారు. సిటీ సెంటర్ లైబ్రరీలో ఉన్న విద్యార్థులను ఈడ్చుకొచ్చి అరెస్టులు చేశారన్నారు.
‘రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ ఖననంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. పార్టీ ఫిరాయింపులపై ఆయనకు ఫిర్యాదు చేశాం. భయపెట్టి పదిమంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. తేదీలతో సహా గవర్నర్‌కు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశాం. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మరో పార్టీ గుర్తుపై ఎంపీగా పోటీ చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని వివరించాం. ఈ రెండు అంశాలపై గవర్నర్‌కు సుదీర్ఘంగా మా అభ్యర్థన వినిపించాం. హోమ్ శాఖ కార్యదర్శిని పిలిచి వివరాలు అడుగుతానని గవర్నర్ చెప్పారు. ప్రభుత్వంతో మాట్లాడుతానని తెలిపారు.
ఎమ్మెల్యేలపై ప్రోటోకాల్ ఉల్లంఘన కూడా జరుగుతుంది. మాలో ఎవరికి కూడా నియోజకవర్గాల్లో గౌరవం దక్కడం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య నేతలందరినీ, ప్రభుత్వ పెద్దలందరినీ కూడా కలుస్తాం. రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ చెబుతున్న మాటలను తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కుతుంది. అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలిసి ఈ విషయంపై వివరిస్తాం. కాళేశ్వరంలో జరిగిన చిన్నతప్పి దాన్ని భూతద్దంలో పెట్టి చూపెట్టాలని కాంగ్రెస్ పార్టీ చూపెట్టింది. త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డను సందర్శిస్తాం’ అని తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment